హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ : గ్రామీణ రహదారుల పనులు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. శుక్రవారం రాజేంద్రనగర్లోని గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ, ఈఈలతో మంత్రి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ రోడ్లకు వెంటనే నిర్వహణ పనులు పూర్తి చేసి గ్రామాలలో రోడ్ల సౌకర్యాలు అనుకున్న విధంగా పునరుద్ధరించాలని ఇంజనీర్లను ఆదేశించారు. గుర్తించిన పనులన్నింటికీ తక్షణమే టెండర్లు పిలిచి సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల రోడ్ల పనులకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, అంచనాలకు అనుగుణంగా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కోరారు.
సమన్వయంపై దృష్టిపెట్టాలి
ఇంజనీర్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారాలు ఇచ్చామని, ఈఈ సర్టిఫై చేసిన వారికే టెండర్ వేసే అధికారాలు ఇచ్చామని ఎర్రబెల్లి గుర్తు చేశారు. అయినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెప్పడం సరికాదని చెప్పారు. స్థానిక శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్లతో సమన్వయం చేసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి రెండువేల కోట్లు కేటాయించినందున వారంలోగా టెండర్ ప్రక్రియ నూటికి నూరు శాతం పనులకు పూర్తి కావాలని, వెంటనే గ్రౌండింగ్ చేపట్టాలని కోరారు.