Maoists | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెస్సెస్, బీజేపీల లక్ష్యాన్ని పరిపూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నదని, సామ్రాజ్యవాదుల, దళారీ, నిరంకుశ బూర్జువా, భూస్వామ్య, కార్పొరేట్ల లాభాల పల్లకిని భుజానికెత్తుకొని మోస్తున్నదని మావోయిస్టుపార్టీ రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 2 నాటికి ‘ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం’ (పీఎల్జీఏ)కి 24 ఏండ్లు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ అధికార ప్రతినిధిత జగన్ సోమవారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ విస్తృతంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నదని జగన్ మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ, అడవులు, భూముల కార్పొరేటీకరణ, వ్యవసాయ, సేవా, పారిశ్రామిక రంగాల కార్పొరేటీకరణ.. ఇలా సర్వం దేశ, విదేశీ దోపిడీ వర్గాలకు అప్పగిస్తున్నదని మండిపడ్డారు.
ప్రజల హామీలు తుంగలో తొక్కి..
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొకి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దోపిడీ విధానాలను అమలు చేస్తున్నదని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం కేం ద్రంతో కలిసి పనిచేస్తున్నదని మండిపడ్డారు. దోపిడీ పాలకులంతా కుమ్మకై 2026 మార్చి వరకు డెడ్లైన్లు ప్రకటించి అణిచివేత ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు. దోపిడీ పీడనలు ఉన్నంతకాలం విప్లవాలను అణిచివేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. పీఎల్జీఏ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జరపాలని పిలుపునిచ్చారు.