Telangana Assembly | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నోటిఫికేషన్ జారీచేశారు.
శనివారం ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలను వేర్వేరుగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో ఆయన మృతి పట్ల సంతాప తీర్మానం ఉంటుంది. అనంతరంసభను వాయిదా వేసి శాసనసభ సలహా మండలి (బీఏసీ) సమావేశం నిర్వహిస్తారు. బీఏసీలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సభను మూడు రోజులు మించి నిర్వహించరాదని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపైనే సమావేశాలు ఉంటాయని చెప్తున్నారు. ఘెష్ ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టి దానిపైనే చర్చను పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. సెప్టెంబర్ ఒకటో తేదీన కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం సభలో పెట్టే అవకాశం ఉన్నది.
సభలో మాట్లాడేందుకు ఇప్పటికే తర్ఫీదు షురూ..!
కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం శాసనసభలో పెట్టనున్న నేపథ్యంలో ఏం మాట్లాడాలన్నదానిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు తర్ఫీదు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టినట్టు తెలిసింది. నివేదికను సభలో ప్రవేశపెట్టిన వెంటనే అధికార పార్టీ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం తీసుకొని బీఆర్ఎస్ను ఇరుకునపెట్టాలన్న వ్యూహంతో ప్రభుత్వం ఉన్నది. దీనికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలను, పలువురు మంత్రులను సిద్ధం చేసినట్టు సమాచారం. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ వంటివారిని కూడా మాట్లాడించాలని యోచిస్తున్నట్టు సమాచారం. వీరందరికీ కమిషన్ నివేదికలోని ముఖ్యమైన పాయింట్లతో ఒక నోట్‌ను ప్రత్యేకంగా సిద్ధంచేసి ఇచ్చినట్టు తెలిసింది.
30న మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 30న సచివాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో కూడా కాళేశ్వరం నివేదికను శాసనసభలో పెట్టే అంశంపైనే చర్చించనున్నారు. దీంతోపాటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని, ఢిల్లీలోని న్యాయనిపుణులు, రాష్ట్ర ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ, మంత్రివర్గ ఉపసంఘాలు కూడా ఇదే చెప్తున్నాయని ముక్తాయింపు ఇచ్చే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు ఇవ్వలేమని, హైకోర్టుకు కూడా ఇదే విషయాన్ని నివేదించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సమాయాత్తం అయ్యే అంశంపై మంత్రివర్గంలో చర్చిస్తారని తెలిసింది.