నిర్మల్ టౌన్, మార్చి 8: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత చేపట్టనున్న దీక్షకు భయపడే కేంద్రం ఈడీతో నోటీసులు జారీ చేయించిందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ దర్యాప్తు సంస్థలను కీలుబొమ్మలుగా మార్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. కక్షసాధింపు ధోరణి వీడి వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాం డ్ చేశారు. ఈ నోటీసులకు భయపడేది లేదని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి దేశంలో ఆదరణ పెరుగుతుండటంతోనే కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు సీబీఐ, ఈడీ దాడుల పేరుతో వేధిస్తున్నదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.