హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : నిర్ణీత గడువులోగా సమాచారమివ్వని ప్రజా సమాచార అధికారులు (పీఐవో)ల తీరుపై రాష్ట్ర సమాచార కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. పలుమార్లు ఆదేశించినా నిర్లక్ష్యం చేస్తుండటంతో చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల విచారణ జరిపి బాధ్యులకు జరిమానాలు విధించింది. ఇందుకు సంబంధించిన రసీదును నెలలోగా రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయానికి పంపించాలని స్పష్టంచేసింది. అలాగే ఫిర్యాదుదారులు కోరిన సమాచారాన్ని తక్షణమే అందజేయాలని ఆదేశించింది. లేదంటే మరిన్నీ కఠిన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించింది.
సమాచారమివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రజా సమాచార అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్ కొరఢా ఝులిపించింది. జగిత్యాల మున్సిపాలిటీలో 2021లో ఓ వ్యక్తి కోరిన సమాచారాన్ని అక్కడి పీఐవో, ఫస్ట్ అప్పిలేట్ అధికారి పట్టించుకోలేదు. దీంతో ఫిర్యాదుదారుడు సమాచార కమిషన్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర సమాచార కమిషనర్ పీఐవో వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదుదారుడు అడిగిన సమాచారంతో పాటు రూ.2వేల జరిమానా చెల్లించి, సంబంధిత రసీదును రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయానికి అందజేయాలని గత నెలలో ఆదేశాలు జారీచేశారు. సిద్దిపేట జిల్లాలో ఓ మహిళ 2021లో గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి కోరిన సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శి పట్టించుకోలేదు. దీంతో ఆమె కమిషన్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కమిషన్ 13.10.2025న సంబంధిత కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. ఇటీవల విచారణ జరిపి వారంలోగా ఫిర్యాదుదారు అడిగిన సమాచారం ఇవ్వాలని, నిర్లక్ష్యం చేసినందుకు రూ.5 వేలు జరిమానా చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది.
సామాన్యుల చేతిలో పాశుపతాస్త్రమైన సమాచార హక్కు చట్టం కొందరు ప్రజా సమాచార అధికారుల తీరుతో నిర్వీర్యమవుతున్నది. వారు నిద్రమత్తులో జోగుతుండటంతో పౌరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. సమాచార కమిషనర్ ఆదేశాలను సైతం భేఖాతరు చేస్తుండడంతో ఆర్టీఐ కమిషన్ వద్ద దరఖాస్తులు, అప్పీళ్లు పేరుకుపోతున్నాయి. కమిషన్ ఉత్తర్వులను భేఖాతరు చేసిన పీఐవోలు, తర్వాతిస్థాయి ఉన్నతాధికారులపై వచ్చిన ఫిర్యాదులు 200కు పైగా పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. వీటిపై విచారణ చేపట్టి తక్షణ చర్యలకు ఉపక్రమించేందుకు కమిషన్ సిద్ధమవుతున్నది. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం కారణంగా ఆర్టీఐ వద్ద 9,926 అప్పీళ్లు, 4,466 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం.