HRC | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. రవాణా శాఖ, హోం శాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారిని, రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీని నివేదిక పంపాలని హెచ్ఆర్సీ ఆదేశించింది.
నిన్న మీర్జాగూడ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో టిప్పర్, బస్సు డ్రైవర్లు ఇద్దరు సహా 19 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన కంకర టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. వికారాబాద్ జిల్లా తాండూరు డిపో ఆర్టీసీ బస్సు (టీఎస్ 34టీఏ6354) తాండూరు నుంచి తెల్లవారుజామున 4:30 గంటలకు 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గంమధ్యలో వికారాబాద్ తదితర బస్టాప్‌లలో ఎక్కిన వారితో కలిపి మొత్తం 72 మంది ప్రయాణికులతో వెళ్తున్నది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేట్ సమీపంలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై చేవెళ్ల నుంచి వికారాబాద్‌కు కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ (టీజీ 06టీ3879) వాహనం ఎదురుగా అతి వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి, దానిపై పూర్తిగా ఒరిగిపోయింది. దానిలో ఉన్న కంకరమొత్తం బస్సులోకి జా రింది. దీంతో ఆర్టీసీ బస్సు కుడివైపున 8 వరుసల సీట్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఆ సీట్లలో కూర్చున్న కొందరు ప్రయాణికులు బలమైన గాయాలతో మరణించగా, మరికొందరు కంకరలో కూరుకుపోయి ఊపిరాడక విలవిల్లాడుతూ చనిపోయారు. బస్సు డ్రైవర్‌తోపాటు టిప్పర్ డ్రైవర్ కూడా దుర్మరణం చెందారు. వీరితోపాటు 17 మంది ప్రయాణికులు ప్రాణాలొదిలారు. మృతుల్లో 12 మంది మహిళలు ఉండగా, ఆరుగురు పురుషులు, 10 నెలల చిన్నారి ఉన్నారు. మరో 25 మంది కి తీవ్రగాయాల పాలయ్యారు.