High Court | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు ఇచ్చిన గంటకే ఎలా కూల్చివేస్తారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంత అత్యవసరంగా ఎందుకు కూల్చివేశారని నిప్పులు చెరిగింది. ప్రభుత్వమే యథాతథస్థితిని కొనసాగించాలని ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా పెండింగ్‌లో ఉండగానే ఎలా కూల్చేస్తారనే లా పాయింట్‌ను లేవనెత్తింది. కనీసం వివరణ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరా అంటూ మండిపడింది. చట్ట ప్రకారం నోటీసుకు వివరణ ఇచ్చేందుకు కనీస గడువు ఉండాలి కదా? అని ప్రశ్నించింది. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల వ్యవహారంలో యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కన్వెన్షన్‌ను కూల్చివేసిన హైడ్రా తీరును తీవ్రంగా ఆక్షేపించింది. శనివారం ఉదయం నోటీసులు ఇచ్చి ఆ వెంటనే ఎలా కూల్చిస్తారని మండిపడింది.
హౌస్ మోషన్ పిటిషన్
సినీ నటుడు అకినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను సవాలు చేస్తూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నల్లా ప్రీతమ్‌రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్‌కుమార్ అత్యవసరంగా విచారణ చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణ క్రమబద్ధీకరణ (బీఆర్ఎస్) వ్యవహారంపై ప్రభుత్వమే స్టేటస్ కో (యథాతథస్థితి) ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులను ప్రభుత్వమే తిరిగి ఎలా ఉల్లంఘిస్తుందని ప్రశ్నించారు. తదుపరి ఉత్తర్వుల వరకు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఇరుపక్షాలు యథాతథస్థితిని కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేరొన్నారు. ఎన్ కన్వెన్షన్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరగా అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్, ఇచ్చామని ప్రభుత్వం చెప్తున్నదని, అయితే నోటీసులు ఇచ్చినట్టు తగిన ఆధారాలు కూడా చూపడం లేదని, ప్రాథమికంగా దీనిపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నందున స్టేటస్ కో ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 29 ఎకరాలని అంటున్నారని, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో చెరువు విస్తీర్ణం 26 ఎకరాలని ప్రభుత్వం చెప్పిందని, ఈ వివరాలపై పొంతన లేనందున యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు.
ఇది హైడ్రామా: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తున్నదని కేం ద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఏ చర్యలైనా అందరికీ సమానంగా వర్తింపచేయాలని, ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే కుదరదని అన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఢిల్లీలో ఆయన స్పందిస్తూ.. గతంలో ఎలా అనుమతులు ఇచ్చారని, అక్రమ నిర్మాణాలకు రోడ్లు, విద్యు త్తు, నీటి సదుపాయం ఎలా కల్పించారని ప్రశ్నించారు.
హైకోర్టు స్టే ఎందుకు ?: రఘునందన్‌రావు
చెరువుల్లోని ఆక్రమణలను సర్వే చేసి కూలగొట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే… ఎన్ కన్వెన్షన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడమేంటని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడంపై ఆయన స్పందిస్తూ.. 2015లో స్టే ఇస్తే ఇప్పటివరకు ఈ కేసు ఎందుకు విచారణకు రాలేదని, ఇది ఎవరి తప్పు అని ప్రశ్నించారు. స్టే ఇచ్చే ముందు సుప్రీం కోర్టు ఆదేశాలపై హైకోర్టు జడ్జీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
అధికారులకు పూర్తి స్వేచ్ఛ మంత్రి జూపల్లి
ప్రభుత్వ వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తమ ప్రభు త్వం అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు.
ఎవరిపైనా కక్ష లేదు మంత్రి పొన్నం
ప్రభుత్వం ఎవరి మీదైనా కక్షతో, వ్యక్తిగత ద్వేషంతో, ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమాజంలో పరివర్తన తెచ్చేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నట్టు పేర్కొన్నారు.