హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల మీద ఇంటిని సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీచేసే అధికారం మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. పోలీసులకు ఆ అధికారం ఉండదని స్పష్టంచేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని రాయల్ విస్టాలో అద్దెకున్న వారు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఆ ఆవాసాన్ని జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ భవన యజమాని అల్లూరి సీతారామరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జీవనోపాధిలో భాగంగా తమ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టు తెలిపారు. అద్దెకున్నవారి రోజువారీ కార్యకలాపాల గురించి తమకు సమాచారం లేదని చెప్పారు. అందులో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అద్దెకున్నవారు మాత్రమే బాధ్యులని అన్నారు.
తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా జప్తు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ భవనంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధంలో భాగంగా భవనాన్ని జప్తు చేశామని చెప్పారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారంతో నోటీసును జారీచేసి జప్తు చేసే అధికారం మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టంచేశారు. పోలీసులకు అలాంటి అధికారం ఉండదని పేరొన్నారు. అంతేగాకుండా ప్రస్తుత కేసులోని రికార్డుల ప్రకారం పిటిషనర్ భవనం యజమాని అని, అద్దెకు తీసుకున్నవారు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిసీ అనుమతించారన్న ఆధారాలు లేవని అన్నారు. రోజువారీ కార్యకలాపాలతో తనకు సంబంధంలేదంటూ పిటిషనర్ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్నట్టు కూడా ఎకడా రికార్డుల్లో లేదని చెప్పారు. కేవలం భవన యజమాని అనే కారణంగా అకడ జరుగుతున్న చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సమ్మతి తెలిపినట్టుగా భావించరాదని, అటువంటి ప్రమేయం ఉన్నట్టు నిరూపించడానికి తగిన సాక్ష్యాలు, ఆధారాలు ఉండాలని స్పష్టంచేశారు. భవనం జప్తులో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని, తక్షణం సీల్ తొలగించి భవనాన్ని పిటిషనర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ఒకవేళ భవనం జప్తు తప్పనిసరని భావిస్తే పోలీసులు చట్టప్రకారం ముందుకెళ్లాలని నిర్దేశించారు.