అమీర్‌పేట, జనవరి 19: ప్రజలు కోరిన చోట కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తామని, అవసరమైతే కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజల నుంచి ఎలాంటి విన్నపమూ రాకపోయినా రాష్ట్రప్రభుత్వం ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కంటివెలుగు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నదని గుర్తుచేశారు. వీటికి అదనంగా ఏదైనా కాలనీ లేదా గేటెడ్ కమ్యూనిటీలో, కంపెనీలు, సంస్థలు తమ ప్రాంగణాల్లో కంటివెలుగు శిబిరాలు అవసరమని భావిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నివారించగలిగిన అంధత్వాన్ని పూర్తిస్థాయిలో తొలగించడమే లక్ష్యంగా కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని, అంధత్వ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
హైదరాబాద్ అమీర్‌పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన రెండవవిడత కంటివెలుగు కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, కమిషనర్ లోకేశ్ కుమార్, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతామహంతి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటిలతో కలిసి మంత్రి హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కంటివెలుగు రెండోదశలో తెలంగాణ వ్యాప్తంగా 16,533 సెంటర్లలో 1500 బృందాలతో నేత్రపరీక్షలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
మారుమూల గ్రామాలు, తండాలు, కోయగూడేల్లోనూ కంటివెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని చెప్పారు. 100 రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో పసి పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. శిబిరానికి వచ్చిన చివరి వ్యక్తికీ కంటిపరీక్షలు నిర్వహించే వరకు కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. అవసరమైన మందులు, కంటిఅద్దాలు ఇస్తారని, శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ విడత కంటివెలుగు కార్యక్రమంలో 55 లక్షల మందికి కంటి అద్దాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
వీటిలో 30 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్‌ను కంటి పరీక్షలు నిర్వహించిన వెంటనే అక్కడికక్కడే అందజేయడం జరుగుతుందని, మిగిలిన 25 లక్షలు ప్రిస్ర్కైబ్డ్ గ్లాసెస్ అని తెలిపారు. కంటిచూపు అవసరాల మేరకు వాటిని ప్రభుత్వమే ప్రత్యేకంగా తయారు చేయించి ఆశావర్కర్ల ద్వారా ఇంటి వద్దే అందజేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
అందరికీ కంటి పరీక్షలు చేయిస్తున్రుచూపు కనబడనోల్లందరికి కంటి పరీక్షలు చేస్తున్నారు. పోయిన ఏడాది నుంచి కంటి పరీక్ష చేయించుకుందామని అనుకుంటున్న. ప్రవేటుకు పోతే పరీక్షలు, మందులని వెయ్యి నుంచి రెండు వేల వరకు గుంజుతారు. కేసీఆర్ ప్రభుత్వం ఊర్లల్లకు డాక్టర్లను పంపి, కంటి పరీక్షలు చేసి మందులు, కండ్లద్దాలు ఉచితంగా ఇస్తున్నది.
-గాడిపల్లి శ్రీశైలం, చిన్నగూడూరు, మహబూబాబాద్
కంటివెలుగు లాంటి కార్యక్రమాలను తమ రాష్ర్టాల్లోనూ ప్రారంభిస్తామని ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు చెప్పడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణను చూసి తాము ఎంతో నేర్చుకుంటున్నామని ఖమ్మంలో బుధవారం కంటివెలుగు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేజ్రీవాల్, భగవంత్ మాన్ చెప్పటం సంతోషం కలిగించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సర్కార్ చేపడుతున్న పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల, కంటివెలుగు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్న తీరుచూసి, తమ తమ రాష్ర్టాల్లో వాటిని అమలు చేసేందుకు ముఖ్యమంత్రులు ఆలోచించడం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనమని తెలిపారు.
కంటివెలుగులో పంపిణీ చేస్తున్న కండ్ల అద్దాలు తెలంగాణలో తయారైనవేనని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలతో స్థానికంగానే కండ్లజోళ్ల తయారీ సాధ్యమైందని చెప్పారు. సంగారెడ్డిలోని ఓ పరిశ్రమ ద్వారా ఇప్పటికే 20 లక్షల కంటి అద్దాలను తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా నేత్ర పరీక్షా శిబిరాలకు పంపించామని తెలిపారు.
రాష్ట్రంలో ఎవరికీ కంటిచూపు సమస్యలు లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన ఎంతో గొప్పదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. స్వాతంత్రం సిద్ధించిన తరువాత ఏ ముఖ్యమంత్రీ ఇంతటి మహోన్నత కార్యక్రమానికి రూపకల్పన చేయలేకపోయారన్నారు. పేదలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కేతినేని సరళ, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఎన్ శేషుకుమారి, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికరణ్, ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు కోరినచోట కంటివెలుగు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రెగ్యులర్ శిబిరాలతోపాటు కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీలో, వివిధ సంస్థల ప్రాంగణాల్లో కంటివెలుగు శిబిరాలు అవసరమని భావిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సోషల్‌మీడియా ద్వారా మంత్రి సూచించారు. శిబిరం కావాలనుకునేవారు వైద్యారోగ్యశాఖకు ట్విట్టర్ లేదా సోషల్ మీడియాలో సమాచారం ఇవ్వాలని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వారైతే సంస్థ వెబ్‌సైట్‌కు, జిల్లాల్లో అయితే కలెక్టర్లకు, డీఎంహెచ్‌వోలకు రిక్వెస్ట్ పెట్టాలని సూచించారు. వినతులను పరిశీలించి ప్రత్యేక బృందాలను పంపి క్యాంపులు ఏర్పాటు చేయిస్తామన్నారు.
తెలంగాణను కంటి సమస్యలు లేని రాష్ట్రంగా చేయాలనే బృహత్తర లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, వేములపల్లిలో గురువారం కంటివెలుగు రెండో విడతను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. వంద రోజుల్లో కంటి పరీక్షలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నదని అన్నారు.
కంటివెలుగు రెండో విడత తొలిరోజే కొత్త రికార్డు సృష్టించింది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1.60 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 బృందాలు 1,500 క్యాంపులను నిర్వహించాయి. 1,60,471 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సగటున ఒక్కో శిబిరంలో 107 మందికి వైద్య పరీక్షలు జరిగాయి. కాగా, పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా కంటి పరీక్షలకు ఆసక్తి చూపారు. రాష్ట్రవ్యాప్తంగా 72,580 మంది పురుషులు కంటి పరీక్షలు చేయించుకోగా, మహిళలు 87,889 మంది తరలి వచ్చారు. మొదటి రోజు దాదాపు 70 వేల మందికి దృష్టిలోపాలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 37,046 మందికి అప్పటికప్పుడే రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. మితగా 33,210 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్ చేశారు.