Maneru | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనేక పురాతన, ప్రాధాన్యమైన జలాశయాలు ఉన్నాయి. పూడిక పేరుకుపోయి నీటినిల్వ సామర్థ్యాన్ని దారుణంగా కోల్పోయాయి. వీటన్నింటినీ వదిలి ప్రభుత్వ పెద్దలు కేవలం లోయర్ మానేరు డ్యామ్, తెలంగాణ ఆవిర్భావం తర్వాత పూర్తయిన మధ్యమానేరు డ్యామ్లలోనే పూడిక తీసేందుకు ముందుకురావడం చర్చనీయాంశమైంది. దీని వెనుక మర్మం రెండు ప్రాజెక్టుల్లోని ‘మేలిమి ఇసుక రాశులే’నని స్పష్టమవుతున్నది. పూడికతీత ఉబలాటం వెనుక కాసుల వేటనే అసలు లక్ష్యమని తేటతెల్లమవుతున్నది. సాగునీటిరంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నారు.
70 శాతానికిపైగా ఇసుకే
నీటిపారుదల శాఖ గతంలో పాత కరీంనగర్, ప్రస్తుత రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు ప్రాజెక్టులో పూడికపై ఓ సంస్థతో సర్వే చేయించింది. ప్రాజెక్టు మొత్తంగా 31 బెడ్ శాంపిళ్లను తీసుకొని పరీక్షించింది. పూడికలో ఇసుక, రాళ్లు, మట్టి, సిల్ట్, కర్బన సమ్మేళనాలు ఎంతశాతం ఉన్నాయనే దానిపై అధ్యయనం చేయించింది. 70 శాతానికి పైగా ఇసుక, 5 శాతం క్లే, 25 శాతం సిల్ట్, 7 శాతం గ్రావెల్ ఉంటుందని నివేదికలు వచ్చాయి. మధ్యమానేరు, లోయర్ మానేరు జలాశయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని నీటిరంగ నిపుణులు చెప్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఇసుక ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
పూడిక పేరిట దోపిడీ
రాష్ట్రంలో నాణ్యమైన ఇసుకకు పేరేన్నికగన్నది మానేరు నదేనని నిర్మాణ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన గోదావరిలో కూడా లభించని గ్రేడ్-1 ఇసుక మానేరులో లభిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. టన్ను ఇసుకకు బహిరంగ మార్కెట్లో రూ. 2500 ధర పలుకుతున్నది. రెండు రిజర్వాయర్లు హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉండడం గమనార్హం. పూడికతీత మాటున ఇసుక దోపిడీకి ప్రభుత్వ పెద్దలు ప్రణాళికలు రూపొందించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఎండీ, ఎంఎండీ రిజర్వాయర్లను ఎంపిక చేయడంలో ప్రధాన కారణం ‘ఇసుకే’నన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పైలట్ ప్రాజెక్టుకే 20 ఏండ్లా?
పైలట్ ప్రాజెక్టు లక్ష్య సాధనకు సాధ్యమైనంత తక్కువ కాలపరిమితి విధిస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విరుద్ధంగా పూడికతీత పైలట్ ప్రాజెక్టు చేపట్టడం గమనార్హం. ఎగువ మానేరుతోపాటు, స్వర్ణ, ఎస్సారెస్పీ, డిండి, రామప్ప, పాలేరు ప్రాజెక్టుల్లోని పూడికపైనా అధ్యయనం చేయించారు. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల నీటి నిల్వసామర్థ్యం గణనీయంగా పడిపోయింది. ఆ ప్రాజెక్టులన్నింటినీ వదిలేసి ఇటీవలే నిర్మాణం పూర్తయి న మధ్యమానేరు జలాశయాన్ని పూడికతీతకు ఎంపిక చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పూడికతీత పైలట్ ప్రాజెక్టు కాంట్రాక్టును 20 ఏండ్ల కాలపరిమితితో కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తున్నది. ఎటుచూసినా ఇది మానేరు గర్భంలోని మేలిమి ఇసుక దోపిడీ కోసమే తప్ప మరోటి కాదని నీటిరంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు.