హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన జీవో 9 అమలుపై హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల తొలగింపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై న్యాయనిపుణులతో కసరత్తు చేసిన ప్రభుత్వం.. సోమవారం దాదాపు 50 పేజీలతో కూడిన పిటిషన్ను ఆన్లైన్లో దాఖలు చేసింది. గతంలో ఇంద్ర సాహ్నికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు 50% మించకూడదని ఏమీ లేదని, విద్య, ఉపాధి రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు చెప్పిందని వాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన ఏకపక్షంగా చేయలేదని, వారి స్థితిగతులపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం చేశాకే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్తున్నది. రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించాక కులాలవారీగా పరిశీలన చేశామని, బీసీల జనాభా 57.6 శాతంగా ఉండటంతో ఆ సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ చేసిన సిఫార్సులను మంత్రివర్గం, శాసనసభ ఆమోదించాయని వివరించింది. రిజర్వేషన్లు 50% మించరాదన్న పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన చట్టసవరణ, ఆర్డినెన్సు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పింది.
బిల్లు, ఆర్డినెన్స్ నిర్ధిష్ట వ్యవధిలోగా ఆమోదించడమో, తిరసరించడమో చేయకపోతే అవి ఆమోదం పొందినట్టు పరిగణించాలని తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రిజర్వేషన్ల పెంపునకు జీవో 9 జారీచేశామని చెప్పింది. ఆ జీవో అమలును హైకోర్టు నిలిపవేయడాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని ప్రభుత్వం ఎస్ఎల్పీలో కోరింది. ప్రస్తుతం ఈ ఎస్ఎల్పీ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నది. నంబర్ కేటాయింపు జరిగాక దానిపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా, ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేస్తే తమ వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వులను జారీ చేయాలని హైకోర్టులో జీవో 9ని సవాల్ చేసిన పిటిషనర్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు.