హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజకీయ సత్సంప్రదాయాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి ఘర్షణ బాటపట్టారు. బుధవారం రాజ్‌భవన్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించి రాజ్యాంగ పదవికి, పరిపాలనా వ్యవస్థకు మధ్య ఉండే సత్సంబంధాల గీతను దాటేశారు. తన పేరిట పనిచేసే కార్యనిర్వాహక వ్యవస్థపై తానే విమర్శలకు దిగారు. తన సంతకం కోసం ఎదురుచూస్తున్న బిల్లులపై వింతైన వివరణ ఇచ్చుకున్నారు.
గవర్నర్ బిల్లులు ఆమోదించడానికి కాలపరిమితి అంటూ ఏదీ లేదంటూ వితండ వాదానికి దిగారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ అంటూ రాజకీయ విమర్శలకు దిగారు. రాజ్‌భవన్‌పై నిందలేస్తున్నారని అంటూనే హద్దులు మీరి రాజకీయ విమర్శ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కమల్ ఫైల్స్ కేసులో తన పేరు ప్రస్తావనకు రావడంపైనా వివరణ ఇచ్చుకున్నారు. గవర్నర్ పదవికి ఉన్న గౌరవాన్ని మరచి అనవసర విషయాలపై అర్థరహిత వివరణలు ఇచ్చుకుంటూ పోయారు.
ఫాంహౌస్ కేసులో తనను లాగే ప్రయత్నాలు చేస్తున్నారని, తన మాజీ ఏడీసీ తుషార్ మెహతాకు కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే అనుమానం ఉన్నదన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్నదని ఇష్టారాజ్యంగా మీడియా సమావేశం పెట్టి మరీ బాధపడిపోవడం గవర్నర్‌కే చెల్లింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను సమగ్రంగా పరిశీలిస్తున్నానని, ఈలోపే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమిళిసై ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వం పంపిన బిల్లుల్లో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లుకు ప్రాధాన్యమిచ్చి పరిశీలించానని, వాటిపై వివరణ కోరానని అన్నారు. బిల్లులపై ఏవేవో సందేహాలను ఏకరువు పెట్టారు. మంత్రి వివరణ ఇచ్చుకునేందుకు వస్తానంటే సమయం ఇవ్వకుండానే రాజ్‌భవన్ తలుపులు ఎప్పుడూ బార్లా తెరిచే ఉంటాయని ఘనంగా ప్రకటించుకున్నారు.
తాను బిల్లులు ఆపలేదంటూనే ఎప్పుడు ఆమోదం తెలిపేదీ వెల్లడించకుండా తన అసలు ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. తాను రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని గవర్నర్ తమిళిసై బాధపడిపోయారు. కానీ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా రిక్రూట్మెంట్ ఎలా జరపాలో సెలవియ్యడం మరచిపోయారు. తనకు బిల్లులపై సందేహాలున్నాయని పేర్కొన్నారు. అడ్డుకోలేదని కొత్త విధానం అవసరమా? కొత్త నియామకబోర్డు అవసరమా? అంటూ శల్యప్రశ్నలు వేశారు.
గవర్నర్ నామమాత్రపు పదవికి, ఎన్నికైన పరిపాలనా వ్యవస్థకు మధ్య తేడా తెలియనట్టు అమాయకత్వం ప్రదర్శించుకున్నారు. తర్వాత వివాదాలు తలెత్తితే విద్యార్థులు, అధ్యాపకులు నష్టపోతారని సానుభూతి ఒలికించారు. కేవలం గవర్నర్ పదవి కారణంగానే తనకు చాన్స్‌లర్ పదవి వచ్చిందని, ఆ గవర్నర్ పరిపాలనా వ్యవస్థ మీదనే ఆధారపడాలని ఆమెకు తెలియదనుకోవాలేమో. ఓవైపు భర్తీని అడ్డుకొంటూనే భర్తీ చేయమని నేనే కోరానని దబాయించారు. అక్కడికి తాను చెప్తేగానీ ప్రభుత్వం రిక్రూట్మెంట్లు జరపదన్నట్టుగా చెప్పుకుంటూ పోయారు.