హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): మక్కజొన్న కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. రైతులు పండించిన మక్కజొన్నల్లో ప్రభుత్వం సగమే కొనుగోలు చేస్తూ మిగిలిన సగం పంటకు కోత విధిస్తున్నది. ప్రభుత్వం విధించిన పరిమితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మక్కజొన్న ఎకరానికి సుమారు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఎకరానికి 18 క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అంతకు మించి ఒక్క గింజ కూడా కొనుగోలు చేయడంలేదు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. సగం పంటనే కొనుగోలు చేస్తే మిగిలిన సగం పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం పంటను కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులు కష్టాలు పట్టవా? 
ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మక్కజొన్న మొక్కలు పడిపోయి, మక్కలు తడిసిపోయి నష్టపోయారు. కనీసం చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే సర్కారు కోతలు, కొర్రీలతో ఇబ్బంది పెడుతున్నది. ముఖ్యంగా ఎకరానికి 18 క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధన రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మిగిలిన పంటను బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుందామంటే అక్కడా ధర వచ్చే పరిస్థితి లేదు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.2వేల లోపే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.400-600 వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులపై కనకరం చూపకుండా నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేయడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
కొనుగోళ్లలో సర్కారు అలసత్వం 
ఆర్థికభారాన్ని తప్పించుకునేందుకే ప్రభుత్వం మక్కల కొనుగోళ్లలో కొర్రీలు పెడు తున్నదనే విమర్శలున్నాయి. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 6.24 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు కాగా, 11.56 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే, 20 లక్షల టన్నులకుపైగా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. ఇందులో 8.66 లక్షల ట న్నుల మక్కలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,400 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ భారా న్ని వీలైనంత మేరకు తగ్గించుకోవాలని ప్ర భుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే నెమ్మదిగా కొనుగోళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 130 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు సగం మాత్రమే ప్రారంభించినట్టు తెలిసింది. మండలానికి ఒకటి మాత్రమే కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు మక్కల కొనుగోళ్లకు ఆధార్‌ను లింక్ చేశారు. దీంతో కౌలు రైతులు, ఆధార్ లింక్ పనిచేయని రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎకరాకు 18 క్వింటాళ్ల పరిమితి, ఆలస్యంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మండలానికి ఒకే కేంద్రం ఏర్పాటు, ఆధార్ అనుసందానం వంటి నిర్ణయాలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి.
కొల్లాపూర్‌లో మక్క రైతుల రాస్తారోకో
మక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. నాలుగు రోజుల కిందట మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు ఎకరాకు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే కొంటామంటూ కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లగా.. రెండ్రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. అయినా అధికారులు పాత విధానంలోనే కొనుగోలు చేస్తామన చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. – కొల్లాపూర్ రూరల్