మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో మెరుగైన వసతులను కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబాబాద్‌లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఏర్పాటు చేసిన కామన్ డైట్, కాస్మొటిక్స్ మెనూచార్ట్‌ను ప్రారంభించారు. వంటశాల, తాగునీరు, బాలికల వసతి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ గిరిజన బాలుర రెసిడెన్షియల్ హాస్టల్‌ను సందర్శించి, మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల దశలోనే విద్యార్థులు మంచి మార్గాన్ని ఎంచుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అనంతరం మహబూబాబాద్ తహసీల్ సెంటర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరాహార దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చి, అధికారంలోకి రాగానే వారిని గాలికొదిలేసిందని విమర్శించారు.