హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచడంపై హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడంలో విజయం సాధించిన పిటిషనర్లు శుక్రవారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన పక్షంలో తమ వాదనలు విన్న తరువాతనే ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరారు. హైకోర్టు రెండు రోజులపాటు జరిపిన విచారణ అనంతరం ఇచ్చిన స్టే ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కేవియట్ పిటిషనర్లు కోరనున్నారు. హైకోర్టు స్టే ఆదేశాలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మాధవరెడ్డితోపాటు మరికొందరు కేవియట్ దాఖలు చేశారు.
హైకోర్టు స్టే ఆదేశాలను జారీచేయడానికి ముందు కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ, చట్టబద్ధమైన కీలకమైన అంశాలను నివృత్తి చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించగానే చట్టం అయిపోతుందా? బిల్లును గవర్నర్ ఆమోదించకుండా చట్టం ఎలా అవుతుంది? సుప్రీంకోర్టు తమిళనాడు కేసులో తాజాగా వెలువరించిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? దీని ప్రకారం బిల్లుకు ఆమోదం ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా ప్రభుత్వం పరిగణించిందా? ఈ విధంగా ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చి ఉంటే ఆ మేరకు నోటిఫికేషన్ ఇచ్చిందా? రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించలేదు కదా? ఆర్డినెన్స్‌ను జూలై 26న రాష్ట్రపతికి పంపినా.. మూడు నెలల కాలపరిమితి ముగియలేదు కదా? అదే ఆర్డినెన్స్‌కు అనుగుణంగా అసెంబ్లీ ఆగస్టు 31న చేసిన చట్టానికి కూడా గవర్నర్ ఆమోదం చెప్పలేదు కదా? అంటూ పలు కీలకమైన, న్యాయబద్ధమైన ప్రశ్నలను హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంధించింది. వీటిలో అత్యంత కీలకమైనది గవర్నర్ బిల్లుకు ఆమోదం చెప్తేనే ప్రభుత్వం నోటిఫై చేయాల్సి వుంటుందని, ఆమోదించని పక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆటోమేటిక్‌గా బిల్లుకు ఆమోదం వచ్చినట్లే కాబట్టి ప్రత్యేకంగా నోటిఫై చేయకర్లేదని ప్రభుత్వం చెప్పడాన్ని న్యాయనిపుణులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.