కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 21 : పెన్షనర్ల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు తమ సమస్యలను ఏకరువు పెడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం ఈ-మెయిల్ పంపారు.
ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చందుపట్ల జనార్దన్, గడ్డం అశోక్ మాట్లాడుతూ.. పెన్షనర్ల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్-2025ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. 2023 జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన పీఆర్సీని అమలు చేస్తున్నా, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని, కోర్టు ఆదేశాల మేరకు పెన్షనర్స్ పెన్షన్ నుంచి సీవీపీ తగ్గింపును 15 ఏండ్లకు బదులు 11 ఏండ్లకు కుదించాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు ఎత్తేసి, కార్మికులకు సరైన న్యాయం చేయాలని కోరారు.