హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆదాయ వనరుగా మారిందని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల నిధుల నుంచి ఇటీవలి ప్రాజెక్టుల ఒప్పందాల వరకు అవినీతి అవకతవకలపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సహా మేఘా కన్స్ట్రక్షన్స్, రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థలు పలు అవినీతి అవకతవకలకు పాల్పడుతున్నట్టు జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ నలుగురి అవినీతి అక్రమాలపై తన వద్ద అన్ని సాక్షాధారాలు ఉన్నాయని, వెంటనే ఆ నలుగురిపై కేసులు నమోదు చేయాలని కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో మేఘా, రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థల నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఎన్నికల బాండ్లు, ఇతర దారుల్లో సుమారు రూ.148 కోట్లు అందాయని, వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ ద్వారా 2023 అక్టోబర్ 10న రూ.50 కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయని, 2023 నవంబర్ 20, 21 తేదీల్లో మరో రూ.60 కోట్లు అందాయని ఆరోపించారు. ఎస్ఈపీసీ పవర్ లిమిటెడ్ కంపెనీ ద్వారా 2023 నవంబర్ 21న రూ.30 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఇవన్నీ నవంబర్ నెలలో రాహుల్‌గాంధీ ఎన్నికల పర్యటనలో, కోడ్ ఉన్నప్పుడు పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేఘా, రాఘవ కంపెనీలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఒప్పందాలు కుదుర్చుకొని కాంట్రాక్టులు కట్టబెట్టిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో కష్టపడి పనిచేసే కొందరు నాయకులను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేలా చేశాడని, ఆ సమయంలోనే రేవంత్‌రెడ్డి అన్నిరకాల డీల్స్ కుదుర్చుకున్నారని తెలిపారు. ఎన్నికల ముందు మేఘా సంస్థపై విచారణ జరిపించి డబ్బు కక్కిస్తానని చెప్పిన రాహుల్‌గాంధీకి నేడు అదే మెఘా కృష్ణారెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారని ఆరోపించారు.
‘కొడంగల్ లిఫ్టు’ అంచనా వ్యయం నాలుగింతలు
నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆ నలుగురికి అవినీతి ఆదాయ వనరుగా మారిందని బక్క జడ్సన్ విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని నాలుగింతలు పెంచారని ఆరోపించారు. 2014లో రూ.1,450.51 కోట్ల అంచనా వ్యయం ఉండగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి దాని అంచనా వ్యయాన్ని రూ.2,945 కోట్లకు పెంచారని, రెండు నెలలు తిరక్కుండానే మరోసారి రూ.4,350 కోట్లకు పెంచారని వివరించారు. ఈ లిఫ్టు ఇరిగేషన్లో విచిత్రంగా వర్క్ అలాట్ చేశారని, మొదట రాఘవ కన్స్ట్రక్షన్స్, మీల్, ఎల్ అండ్‌టీ, నాగార్జున కన్స్ట్రక్షన్స్ ముందుకు రాగా, వాటన్నింటినీ కాదని, ఎల్1గా పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, ఎల్2గా మీల్ సంస్థకు అప్పజెప్పారని తెలిపారు. ఇందులో క్విడ్‌ప్రోకో ద్వారానే అది సాధ్యమైందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ డీల్ కుదుర్చుకున్నది ఓటుకు నోటు కేసులో ఉన్న ఏ1 నిందితుడు సీఎం రేవంత్‌రెడ్డి కాగా, అదే కేసులో ఏ2గా ఉన్న ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి.. ఈ డీల్‌కు మధ్యవర్తిత్వం నడిపారని ఆరోపించారు.
45 మంది ఫోన్ ట్యాపింగ్
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతోపాటు అధికారులు, సామాజికవేత్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేస్తున్నదని జడ్సన్ ఆరోపించారు. తాను ఇటీవల ఒక అధికారిని కలిసినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారని, సుమారు 45 మంది మొబైల్ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, ఇందులో 25 మంది కాంగ్రెస్ వారేనని, వారిలో కూడా 12 మంది మంత్రులు, ఇద్దరు ఎంపీల ఫోన్లు ఉన్నాయని ఆ అధికారి చెప్పారని జడ్సన్ వివరించారు. సమావేశంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ జనార్ధన్, గిరిబాబు పాల్గొన్నారు.