హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సంస్థ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఏ పద్ధతి ప్రకారం ఏజెన్సీని ఎంపిక చేశారు? ఆ ఏజెన్సీకి ఎంత చెల్లించారని అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అందాల పోటీల ఖర్చు, నిర్వహణ సంస్థ ఎంపిక, ఇతర అంశాలపై రంగారెడ్డి జిల్లాకు చెందిన గౌతమ్గౌడ్ ఆర్టీఐ కింద అడిగిన ఆరు ప్రశ్నలకు తెలంగాణ టూరిజంశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బుధవారం అరకొర సమాధానాలిచ్చారు.
హైదరాబాద్ వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరిగే ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలను ఏ సంస్థ నిర్వహిస్తున్నదన్న ప్రశ్నకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన మిస్ వరల్డ్ లిమిటెడ్ అని తెలిపారు. ఏ పద్ధతి ప్రకారం ఈ ఏజెన్సీని ఎంపిక చేశారు? ఏజెన్సీకి ఎంత చెల్లించారని అడిగితే ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నిర్వహణ సంస్థతో చేసుకున్న కాంట్రాక్టు/ అగ్రిమెంట్ కాపీలు ఇవ్వాలని కోరగా ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 8(1)డీ ప్రకారం సమాచారం ఇవ్వబోమని తెలిపారు.
అందాల పోటీలకు మొత్తం ఎంత ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారని అడగ్గా, మొత్తం రూ.54 కోట్లు అని, పోటీలు నిర్వహిస్తున్న రాష్ట్రం సగం భర్తిస్తుందని, అంటే రూ.27 కోట్లు అని తెలిపారు. నిర్వహణ ఖర్చులు, రాష్ర్టానికి వచ్చే ప్రయోజనాలకు సంబంధించిన ఏమైనా డీపీఆర్ ఉన్నదా? అన్న ప్రశ్నకూ సమాధానం దాటవేశారు. అందాల పోటీలు హైదరాబాద్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్న అధికారులు.. పోటీల నిర్వహణ నిర్ణయానికి సంబంధించిన నోట్ షీట్ ఏమైనా ఉన్నదా? అన్న ప్రశ్నకూ సమాధానం దాటవేశారు.