Telangana | హైదరాబాద్, నవంబర్6 (నమస్తే తెలంగాణ): దేశానికి రోల్‌మాడల్‌గా తెలంగాణలో ఇంటింటి సర్వే చేపడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు చెప్తుంటే.. మరోవైపు సర్వే చెల్లుబాటవుతుందా అని బీసీ సంఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ముఖ్యంగా బీసీ మేధావివర్గంలో ఈ సర్వేపై లోతైన చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానరహిత, లోపభూయిష్ట పద్ధతులకుతోడు న్యాయపరమైన అవరోధాలు సర్వే చెల్లుబాటును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. సర్వే వివరాల చట్టబద్ధతకు అవకాశమే లేదని కొందరు చెప్తుండగా, చెల్లుబాటైనా ఆ నివేదికను గోప్యంగా ఉంచకతప్పదని మరికొందరు తేల్చిచెప్తున్నారు.
న్యాయపరమైన చిక్కులెన్నో..
వాస్తవానికి జనాభా గణన, సర్వే రెండూ వేర్వేరు. జనాభాగణన అంటే మొత్తం ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించడం. సర్వే అనేది నిర్దేశిత లక్ష్యాలతో ఏదైనా ఒక అంశానికి సంబంధించి, మొత్తం జనాభాలో కొంతమందిని శాంపిల్‌గా ఎంపిక చేసుకుని నిర్వహించేది. అందుకు సంబంధించి దేశంలో రెండు రకాల చట్టాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. జనాభాగణన అంశం అనేది 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలోని అంశం. 1948 చట్టం ప్రకారం జనగణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే ఉన్నది. ఎలాంటి జనగణన అయినా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాల్లేవు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండకపోవడమేగాక, అమలు చేసే అవకాశం కూడా లేదు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వమే గణాంకాల సేకరణ చట్టం 2008 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు డేటా సేకరణకు కొన్ని పరిమిత అధికారాలను బదలాయించింది. నిర్దేశిత అంశానికి సంబంధించి గణాంకాలను సేకరించే అధికారాన్ని రాష్ర్టాలతోపాటు, కేంద్రపాలిత ప్రాంతాలకు, అటు తరువాత పంచాయతీలు, మున్సిపాల్టీలకు సైతం కల్పించింది. అదే సమయంలో కొన్ని షరతులనూ విధించింది. 2017లో ఈ చట్టానికి మరిన్ని సవరణలు చేశారు. 2008 చట్టం ద్వారా 7వ జాబితాలోని జనాభాగణనను నిర్వహించకూడదు. ఆ పరిధిలోకి రాదు. ఒకవేళ రాష్ట్రం నిర్వహించాలని భావించినా.. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అంతేకాదు సేకరించిన డేటా వెల్లడిపైనా అనేక ఆంక్షలను విధించింది.
చట్టాలకు విరుద్ధంగా నిర్వహణ
రాష్ట్ర ప్రభుత్వం పేరుకు ఇంటింటి సర్వే అని చెప్తున్నా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జనాభాగణననే నిర్వహిస్తున్నదని మేధావివర్గం వివరిస్తున్నది. గణాంకాల సేకరణ చట్టం-2008 ప్రకారం సర్వే నిర్వహించాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నోడల్ అధికారులను నియమించాల్సి ఉంటుంది. సదరు అధికారులు కేంద్రం ఆధీనంలోనే పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు నిర్వహించతలపెట్టిన సర్వేకు సంబంధించిన నిబంధనలను కూడా పూర్తిగా కేంద్రమే నిర్ణయించాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ ద్వారా సర్వేకు సంబంధించిన ప్రశ్నావళిని సైతం కేంద్రమే రూపొందించాలి. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సర్వేను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన సర్వే ఎందుకోసం?, ప్రజలకు ఏ ప్రయోజనం కలుగుతుంది? అనే అంశాలపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు.
జీవోల్లోనూ పేర్కొనలేదు. అంతేకాదు చట్టంలో నిర్దేశించినవిధంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క నోడల్ అధికారినీ నియమించలేదు. నిపుణుల కమిటీని కూడా నియమించలేదు. ఇవేవీ చేయకుండానే కేవలం ప్రణాళికశాఖను నోడల్ ఏజెన్సీగా పెట్టి, వారితోనే ప్రశ్నావళిని రూపకల్పన చేయించి సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహింపజేస్తున్నదని తెలంగాణ మేధావివర్గం, న్యాయకోవిదులు చెప్తున్నారు. అంతిమంగా సర్వే న్యాయస్థానాల ఎదుట చెల్లుబాటు కావడం కష్టమేనని వారు స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే గతంలో 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తరహాలోనే నివేదిక గోప్యంగానే ఉంచకతప్పదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నాడు కుటుంబ సర్వేపై న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయయని, ఈ నేపథ్యంలోనే ఆ నివేదికలను వెల్లడించలేదని గుర్తుచేస్తున్నారు. అదీగాక బీహార్ చేపట్టిన కులగణన సర్వేకు సంబంధించి కూడా ఇంతవరకు వివరాలు బహిర్గతం కాలేదు. వీటిని ఉదహరిస్తున్న బీసీ మేధావులు తాజా సర్వేపై సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.