బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం చూస్తే బంగారు కడియం, పులి కథను గుర్తుకు తెస్తున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్ల పేరిట బిల్లులు చేశామని సంకలు గుద్దుకుంటున్న సర్కారు.. అదే బీసీ విద్యార్థులకు పిడుగులాంటి వార్తతో బెంబేలెత్తిస్తున్నది. తాజాగా పాలిటెక్నిక్ కోర్సుల ఫీజును ఏకంగా 161శాతం మేర పెంచుతూ కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. మరో దగా ఏమిటంటే.. గతంలో పూర్తి ఫీజును రీయింబర్స్మెంట్ ఇవ్వగా, ఈసారి నుంచి రూ.14,900కే సీలింగ్ విధించింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ట్యూషన్ ఫీజులను రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు భారీగా పెంచింది. గతంలో రూ.14,900గా ఉన్న ఆ ఫీజును ఏకంగా రూ.39 వేలకు పెంచింది. 161శాతంగా పెంచిన ఆ ఫీజులకు పూర్తిగా రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకున్నది. కేవలం రూ.14,900 సీలింగ్ విధించి, అంత మొత్తానికే రీయింబర్స్మెంట్ ఇస్తామని తాజాగా స్పష్టంచేసింది.
ఈ విద్యా సంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కోర్సుల్లోని బీసీ విద్యార్థులకు రూ. 14,900ను రీయింబర్స్మెంట్ కింద ఇస్తామని, మిగతా మొత్తాన్ని విద్యార్థులు చెల్లించుకోవాలని ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ తాజాగా ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం గతంలోనే జీవోను జారీచేసింది. గతంలో ఫీజు రూ.14,900 ఉండటంతో ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత గల వారికి సర్కారు మొత్తం రీయింబర్స్చేసేది. కానీ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా కొత్తగా సీలింగ్ విధించి బీసీ విద్యార్థులను దగా చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచిందని విద్యార్థి సంఘాలు గగ్గొలు పెడుతున్నాయి. మొత్తం రీయింబర్స్మెంట్ ఇవ్వనప్పుడు ఫీజులెందుకు పెంచారని ఆయా సంఘాలు మండిపడుతున్నాయి.
దశాబ్దకాలంగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.14,900గానే ఉన్నది. ఇప్పుడు ఆ ఫీజులను రూ.39 వేలకు పెంచుతూ ప్రభుత్వం 2024 అక్టోబర్ 30న జీవో-38ని విడుదల చేసింది. గతంలో మొ త్తం ఫీజును రీయింబర్స్ చేయగా, తాజాగా పెంచిన ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్మెంట్ చేస్తుందని అంతా భావించారు. కానీ సర్కారు ఒక్క బీసీ విద్యార్థులు మినహా అందరికీ పూర్తి ఫీజులు చెల్లిస్తామని ప్రకటించింది. తాజాగా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా సర్కార్ చెల్లిస్తుంది.
జిల్లా పరిషత్, ప్రభుత్వ స్కూళ్లు, నవోదయ, గురుకులాల్లో చదివిన వారు.. పాలిసెట్లో వెయ్యిలోపు ర్యాంకు వచ్చిన వారందరి పూర్తి ఫీజులను సర్కారే భరిస్తుంది. ఈ మూడు క్యాటగిరీల పరిధిలోకి రాని వారికి రూ.14,900 ఫీజునే చెల్లిస్తామన్నది. ఈ మూడు క్యాటగిరీల్లోకి వచ్చే వారు బీసీ విద్యార్థులే అధికంగా ఉంటారు. బీసీ విద్యార్థులపై ఫీజుల భారం మోపాలనే సర్కారు నిశ్చయించుకున్నట్టు స్పష్టమవుతున్నది. దీంతో ఒక్కో బీసీ విద్యార్థిపై రూ.24,100 చొప్పున అదనపు భారం పడనున్నది.
రాష్ట్రంలో 55 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా, 43 కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.39వేలకు పెరిగింది. మిగతా 12 కాలేజీల్లో ఒక కాలేజీలో రూ.14,900 ఫీజు మాత్రమే ఉండగా, 11 కాలేజీల్లో ఫీజులు రూ.15వేల నుంచి 36 వేల మధ్యలో ఉన్నాయి. అంటే ఒక్కో విద్యార్థి గరిష్ఠంగా రూ.24 వేలు, కనిష్ఠంగా రూ.10 వేలను గతంకంటే అదనంగా చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ ఫీజుల సవరణకు నో చెప్పిన సర్కార్.. 2025-28 మూడేండ్ల బ్లాక్ పీరియడ్లో ఫీజుల పెంపునకు సర్కారు బ్రేక్ వేసింది. కానీ, పాలిటెక్నిక్ ఫీజుల పెంపు వెనుక కొన్ని కాలేజీలకు లాభం చేకూర్చే వ్యవహారం దాగి ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.