హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): కులగణన సర్వేలో వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, ఈ నెల 28లోగా వివరాలు నమోదు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్వేలో పాల్గొనని వారి కోసం టోల్‌ఫ్రీ నంబర్ 040-21111111ను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదుచేయనున్నట్టు తెలిపారు. ఎంపీడీవో, వార్డు ఆఫీసులకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలనుకునేవారు http: //seeepsurvey.cgg.gov.in ద్వారా తమ సమాచారాన్ని ఇవ్వవచ్చని సూచించారు. కులగణన సర్వే జరగని ప్రాంతాల్లో కులసంఘాల నేతలు, మేధావులు అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.