హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జాతీయ ఆహార భద్రత చట్టం-2013 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రం, జీహెచ్ఎంసీ, జిల్లా, డివిజన్, చౌక ధరల దుకాణం స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీ అనిల్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీకి పౌరసరఫరాల శాఖ మంత్రి చైర్మన్గా, ఆ శాఖ కమిషనర్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు.
హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని విజిలెన్స్ కమిటీలకు కలెక్టర్లు నేతృత్వం వహిస్తారు. జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. డివిజన్ స్థాయి కమిటీలకు ఆర్డీవోలు, గ్రామీణ చౌక ధరల దుకాణం స్థాయిలోని కమిటీలకు సర్పంచ్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో చీఫ్ రేషనింగ్ అధికారి, సర్కిల్ స్థాయిలో జిల్లా సివిల్ సైప్లె ఆఫీసర్లు, చౌక ధరల దుకాణాల స్థాయిలో వార్డు మెంబర్లు చైర్మన్లుగా విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.