Secretariat | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సచివాలయం ఎదుట మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లుంబినీ పార్కు, తెలంగాణ అమరవీరుల స్మారకం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని అందంగా పచ్చదనంతో ఉండేలా డిజైన్ చేసి పనులు చేపట్టాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కి ప్రభుత్వం సూచించింది. కొత్త సచివాలయం నిర్మాణం తర్వాత తెలుగుతల్లి విగ్రహం కూడలిని పూర్తిగా తొలగించి సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుతోపాటు దాని చుట్టు పక్కల అభివృద్ధికి సుమారు రూ.1.74 కోట్ల వ్యయం అంచనా వేశారు.
హుస్సేన్‌సాగర్ తీరంలో ఉన్న ఈ ప్రాంతా న్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, ట్రాఫిక్ చిక్కులు లేకుండా పార్కింగ్ స్థలాలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ల్యాండ్ స్కేపింగ్ చేస్తున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన నూతన సచివాలయాన్ని చూసేందుకు నగరవాసులతోపాటు వివిధ ప్రాంతాలను నిత్యం ప్రజలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కూడలిని ప్రత్యేకంగా డిజైన్ చేసి నిర్మిస్తున్నామని, ఇప్పటికే ఆర్కిటెక్టులతో కలిసి హర్టికల్చర్ విభాగం అధికారులు చర్చలు జరిపారని తెలిపారు. దీనికి డిజైన్లు ఖరారు చేసిన తర్వాత టెండర్లు పిలిచి పనులు చేపడతామని హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.