మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో సెప్టెంబర్ 27,28 తేదీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 83 రోజులు గడిచినా ఇప్పటివరకు కేసు నమోదైనట్టు ఈడీ నుంచి ప్రకటన రాలేదు.
ఫార్ములా-ఈ రేసులో కేటీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఈడీ సుమోటోగా తీసుకొని, కేసు నమోదు చేసింది.
మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒక న్యాయం.. కేటీఆర్‌కు ఒక న్యాయమా?
Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, సుమోటోగా తీసుకొని స్వయంగా ఏసీబీ అధికారులను అడిగి వివరాలు సేకరించి, కేసు నమోదు చేయడం పట్ల నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వెలుగు చూసిన కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు స్వయంగా ఫిర్యాదు చేసినా, ఈడీ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసినా పట్టించుకోని అధికారులు కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు మాత్రం ఉత్సాహం చూపడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘటనను ఎత్తి చూపుతూ ఈడీ ద్వంద్వ వైఖరిపై మండిపడుతున్నారు.
పొంగులేటికి ఒక న్యాయం..
ఈ ఏడాది సెప్టెంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, హిమాయత్‌సాగర్‌లో జరిగిన ఈ సోదాల్లో పెద్దఎత్తున నగదు దొరికిందన్న ఆరోపణలు వినిపించాయి. అధికారులు మూడు నగదు కౌంటింగ్ మెషిన్లను తీసుకెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. సాధారణంగా ఈడీ అధికారులు ఎక్కడ సోదాలు జరిపినా ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తుంటారు. ఇప్పటివరకు 83 రోజులు జరిగినా ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. పైగా ఈడీ దాడులకు ముందే సీపీయూలు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర కీలక పత్రాలను తరలించారని ఆరోపణలు వచ్చినా.. ఆ దిశగా ఈడీ దృష్టిసారించలేదు. మంత్రి పొంగులేటి కూడా తనపై ఈడీ దాడులు జరిగినప్పుడల్లా సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరాలు వెల్లడిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఆయన కూడా గప్‌చుప్‌గా ఉన్నారు.
ఇవెందుకు సుమోటోగా తీసుకోలేదు?
కేటీఆర్‌పై నమోదైన కేసును సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిన ఈడీ.. రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన ఇతర ఆరోపణల్లో సొంతంగా ఎందుకు విచారణ ప్రారంభించడం లేదని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో రూ.1100 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. 35 లక్షల టన్నుల ధాన్యాన్ని ఖాళీ చేసే గ్లోబల్ టెండర్లలో రూ.750 కోట్లు, మిల్లర్ల దగ్గర నుంచి బియ్యం కొనుగోళ్ల రూపంలో మరో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించింది. ఇది మనీలాండరింగ్ అని, ఈడీ విచారణ జరపాలని కేటీఆర్ పలుమార్లు డిమాండ్ చేశారు. అయినా ఈడీ సుమోటోగా కేసు నమోదు చేయలేదు. అమృత్ స్కీం టెండర్ల పనుల్లో కుంభకోణం జరిగిందని, అర్హతలేని కంపెనీకి రూ.1137 కోట్ల పనులు కట్టబెట్టారని కేటీఆర్ ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వం, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయినా ఈడీ సుమోటోగా ఎందుకు కేసు నమోదు చేయలేదని, విచారణ జరపడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ కేసు నమోదు చేసిందని విమర్శిస్తున్నారు.
కేటీఆర్‌కు మరో న్యాయం..
రాష్ట్రంలో ఫార్ములా-ఈ నిర్వహణకు హెచ్ఎండీఏ నుంచి రూ.55 కోట్లు విడుదల చేసిన ఘటనలో పురపాలక శాఖ కార్యదర్శి దానకిశోర్ గురువారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అంతే.. శుక్రవారం ఈడీ రంగంలోకి దిగింది. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా సుమోటోగా తీసుకొని వివరాలు తీసుకొని, కేసు నమోదు చేసింది.