హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కంటివెలుగు ద్వారా రాబోయే 50 రోజుల్లో రెండు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె కంటివెలుగు, ఆరోగ్య మహిళ, పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, జీవో 58,59,76,118 అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గత 47 పనిదినాల్లో 96 లక్షల మందికిపైగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారని వెల్లడించారు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా మరింత విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.
జీవో 58,59 కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుల గడువును మరో నెల పొడిగించడంతోపాటు కటాఫ్ తేదీని కూడా 2014 జూన్ 2 నుంచి 2020 జూన్ 2 వరకు పొడిగించినందున చాలా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గతంలో తిరసరణకు గురైన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించాలని సూచించారు. జీవో 58,59,76,118కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ త్వరగా పరిషరించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ శ్వేతా మహంతి, రవాణా, రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కమిషనర్ యోగితా రాణా, మున్సిపల్ పరిపాలనాశాఖ కమిషనర్ సత్యనారాయణ, ప్రత్యేక అధికారి సీసీఎల్ఏ సత్యశారద తదితరులు పాల్గొన్నారు.