సిద్దిపేట కమాన్, నవంబర్ 26 : హైదరాబాద్‌లో మూసివేసిన కల్లు దుకాణాలు తెరిపించి గౌడన్నలకు వెన్నుదన్నుగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గీత కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని తెలిపారు.
గత ప్రభుత్వాలు గీత వృత్తిని నిర్వీర్యం చేశాయని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని కొనియాడారు. నీరా పాలసీ గౌడ జాతికి వరమని తెలిపారు. గౌడ బిడ్డలకు వైన్స్‌ల కేటాయింపులో రిజర్వేషన్ కల్పించిన దేవుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రతి గౌడ బిడ్డ బీఆర్ఎస్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు పల్లె రవికుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, కౌన్సిలర్లు వినోద్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, జిల్లా అధ్యక్షులు పల్లె బాలకిషన్ గౌడ్, సిద్దిపేట సంఘం అధ్యక్షుడు గాదగోని ప్రకాశ్‌గౌడ్, డైరెక్టర్లు, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.