హైదరాబాద్, మే27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవన్‌తోపాటు, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలు, నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగరేసి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని, పార్టీ సీనియర్ నేతలు, శ్రేణులంతా పాల్గొనాలని, ప్రజలతో కలిసి అవతరణ వేడుకలు జరపాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పద్నాలుగేండ్ల అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో జూన్ 2న పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొని జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఆవిషరిస్తారని తెలిపారు. ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అలాగే తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ జెండాతోపాటు పార్టీ జెండాలను ఎగరేసి సంబురాలు జరపాలని కోరారు. అమరుల త్యాగాలు, ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారమైందని కేటీఆర్ గుర్తుచేశారు.