హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): అవినీతి రహిత పాలన అన్నారు.. డబుల్ ఇంజిన్ గ్రోత్ అన్నారు.. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని గప్పాలు పోయారు.. సంపద సృష్టిలో తమను మించినవారు లేరని గొప్పలు చెప్పుకొన్నారు.. తీరా చూస్తే అప్పులు చేసి కొప్పులు పెట్టారు.. ఇదీ బీజేపీ పాలిత రాష్ర్టాల పరిస్థితి.. కాదుకాదు.. దుస్థితి. దేశంలో గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో నాలుగు బీజేపీ పాలిత రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ చేసిన అప్పులు దేశంలోని సగం రాష్ర్టాల మొత్తం అప్పులకంటే ఎక్కువ. వైబ్రంట్ గుజరాత్ అని.. గుజరాత్ మాడల్ అని ఊదరగొట్టిన ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కూడా బీజేపీ పాలనలో అప్పుల కుప్పగా మారింది. ఈ లెక్కలు ఎవరో అనామకులు చెప్పినవి కావు.. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బయటపెట్టిన పచ్చి నిజాలు. ‘స్టేట్ ఫైనాన్సెస్- ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్’ 2021-22 నివేదికలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్థిక నిర్వహణ ఎంత ఘోరంగా ఉన్నదో కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ కూడా అప్పులు చేయటంలో అన్ని రికార్డులు బద్దలు కొట్టిందని గణాంకాలతో బయటపెట్టింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు చేసిన అప్పులతో పోలిస్తే తెలంగాణ అప్పులు చాలా తక్కువ అని నివేదిక స్పష్టంచేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొద్దిపాటి అప్పులపై నానా యాగీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు, వారి పాలనలో ఉన్న రాష్ర్టాల పరిస్థితిని గురించి ఏం చెప్తారో మరి.
డబుల్ ఇంజిన్ అప్పుల కుప్పలు
బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు చేసిన అప్పులు, తెలంగాణతో సహా 13 ఇతర రాష్ర్టాల అప్పుకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 2018-19, 2019-20, 2020-21, 2021-22లో ఉత్తరప్రదేశ్ చేసిన అప్పు మొత్తం రూ.2,61,353 కోట్లు. కర్ణాటక చేసిన అప్పు రూ.2,24,200 కోట్లు. గుజరాత్ గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో చేసిన అప్పు రూ.1,62,651 కోట్లు. ఇదే కాలంలో తెలంగాణ అప్పు రూ.1,55,133 కోట్లు మాత్రమే. గత నాలుగేండ్లలో యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ అప్పు మొత్తం రూ.8,12,704 కోట్లు. ఇది తెలంగాణ, ఒడిశా, బీహార్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, అరుణాచలప్రదేశ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ర్టాల మొత్తం అప్పు (రూ.6,81,431 కోట్లు) కంటే రూ.1,31,273 కోట్లు ఎక్కువ. గత నాలుగేండ్లలో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ చేసిన అప్పు రూ.1,84,346 కోట్లు. ఇది తెలంగాణ అప్పు కంటే రూ.80,000 కోట్లు ఎక్కువ.