షాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రవాస భారతీయులు ముందుకురావాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నారైలు భాస్కర్‌రావు, శ్యామల సౌజన్యంతో శశిరావు ఫౌండేషన్ యూఎస్ఏ, టెక్సాస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తోలుకట్టా గ్రామంలో రూ.2 కోట్లతో నిర్మించిన నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవానాన్ని శనివారం ఆమె ఎమ్మెల్సీ వాణీదేవి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించామని చెప్పారు.
నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఆసక్తి ఉన్న వారు వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 11 వందల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం కింద రూ.7,500 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. విదేశాల్లో ఉంటున్న భాస్కర్‌రావు కుటుంబ సభ్యులు మాతృదేశంలోని పేద విద్యార్థుల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.