హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేడు(గురువారం)ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీజీయూఎంహెచ్ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదనాయక్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదని, ఉద్యోగులకు 2 పీఆర్సీలు, 5 డీఏలు పెండింగ్ ఉన్నట్టు వెల్లడించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం లేదని, సీపీఎస్ రద్దు, జీవో 317పై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. సదస్సుకు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు.