హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : నాలుగో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో 10రోజుల పసికందును విక్రయించిన ఘటనలో శిశువును గుర్తించిన అధికారులు.. శిశువు సంరక్షణ నిమిత్తం మంగళవారం తెలంగాణ స్టేట్హోంకు తరలించారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం ఎల్లాపురంతండాకు చెందిన కొర్ర బాబు, పార్వతి దంపతులు శిశువును భారంగా భావించి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందిన వ్యక్తులకు విక్రయించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
విషయం తెలిసిన నల్లగొండ ఐసీడీఎస్ సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్(సీడబ్ల్యూసీ) కమిటీ అధికారులు వారిని విచారించగా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందునే విక్రయించినట్టు తేల్చారు. దీంతో పసికందును తెలంగాణ స్టేట్హోంకు తరలించారు. చట్టవిరుద్ధంగా పసికందు దత్తతను ప్రోత్సహించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది. నల్లగొండ జిల్లాలో పదేపదే శిశువిక్రయాల ఘటనలు జరుగుతున్నప్పటికీ, వాటిని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.