హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): లగచర్లలో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న రైతుల నిరసనలను పట్టించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ తేల్చిచెప్పారు. ప్రజల ప్రతిఘటనను ప్రభుత్వం తప్పుదోవ పట్టించవద్దని, పేదల భూములను దురాక్రమణ చేయొద్దని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘటనకు ముందు ప్రజలంతా పార్టీలతీతంగా ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి విజ్ఞప్తులు చేశారని తెలిపారు. తమ భూములను లాక్కోవద్దని అనేక రకాలుగా వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదనే.. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారని తెలిపారు. భూసేకరణను చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా చేయాల్సి ఉండగా, ప్రభుత్వం బలవంతంగా లాక్కొనే ప్రయత్నంలోనే లగచర్ల ఘటన చోటుచేసుకున్నదని పేర్కొన్నారు. ఇప్పటికైనా లగచర్ల రైతులు, యువకులపై పెట్టిన కేసులను ఎత్తేసి, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయంతి, నాయకులు జీవి, పులిరాజు, రవీందర్, విజయానంద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.