Supreme Court | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తీర్పును ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. రాష్ట్రాలకు అధికారం కల్పించింది. ఈ సందర్భంగా 2004లో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది.
రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేయవద్దన్న నాటి తీర్పును కొట్టివేసింది. 6:1 మెజారిటీతో తీర్పును రాజ్యాంగ ధర్మాసనం అయితే, జస్టిస్ బేలా త్రివేది విభేదించారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర అనుకూలంగా తీర్పును ఇచ్చారు. రిజర్వేషన్ల అంశంలో పంజాబ్ ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విస్తృతంగా విచారించింది. రాష్ట్రాలకు అధికారం ఉండదని, పార్లమెంట్‌కు మాత్రమే ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయగలదని పేర్కొంటూ 2004లో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే, ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ ప్రభుత్వ ఎస్సీ కోటా రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ఉందని పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో వెలువరించిన ఉత్తర్వులో అభిప్రాయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాజ్యాంగ అధికరణం 14(సమానత్వ హక్కు)కు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో పేర్కొంది.
షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలనుకున్నా.. తొలగించాలనుకున్నా పార్లమెంట్‌కు మాత్రమే మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాలకు కాదంటూ 2004 తీర్పులో స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పును పంజాబ్‌కు వర్తించదంటూ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. విస్తృత ధర్మాసనానికి ఈ వివాదాన్ని బదిలీ చేయాలని 2020లో సిఫార్సు చేసింది. ఇటీవల మళ్లీ కేసు విచారణకు వచ్చింది. ఈ క్రమంలో రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ రాష్ట్రాలకు అధికారం ఉంటుందంటూ తీర్పును వెలువరించింది.