హైదరాబాద్, ఆగస్టు03(నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం జరగనున్నది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నివేదికగా నిర్ణయించారు. ఘోష్ కమిషన్ నివేదికతోపాటు, ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చే నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా క్యాబినెట్లో చర్చకు పెట్టనున్నారు.
ఇటీవలే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అనంతరం ఈ నివేదిక అధ్యయనానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు ఆదివారం కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. తెలంగాణ క్యాబినెట్‌కు ఇవ్వాల్సిన కాళేశ్వరం నివేదికపై ఈ సందర్భంగా చర్చించారు.