హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను కేంద్రంలోని బీజేపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు విమర్శించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, కులగణన చేపట్టేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో హక్కుల సాధనకు బీసీ సంఘాలన్నీ ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీసీల ధర్మ పోరాటం పేరుతో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన బీసీ సంఘాల సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఓబీసీ శాఖ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నేతృత్వంలో 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ను కలిసి విన్నవించామని, బీజేపీ సర్కారుకు కూడా అనేక లేఖలు రాశామని గుర్తుచేశారు. కులగణన చేపట్టాలన్న బీసీల డిమాండ్‌ను పట్టించుకోకపోవడం, 2011 కులగణన వివరాలను ప్రకటించకపోవడం బీసీలపై కేంద్రం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బీసీలంతా తీవ్రంగా పోరాడితే 9 నెలల విరామం తర్వాత ఇటీవల జాతీయ బీసీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించారని, వైస్ చైర్మన్, సభ్యుల్ని ఇంకా నియమించలేదని అన్నారు. 40 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.986 కోట్లు కేటాయించి ‘సబ్కా సాథ్’ అనడం హాస్యాస్పదమన్నారు. దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ బీసీ అయిన ప్రధాని మోదీ హయాంలోనే బీసీల హక్కులు కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీసీ శాఖ, కులగణన తదితర అంశాలపై జాతీయస్థాయి ఉద్యమంలో భాగంగా వివిధ రాష్ర్టాల్లో అకడి బీసీ నాయకులతో సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి యుగంధర్, అలేఖ్య గ్రూప్ చైర్మన్ ప్రభాకర్‌యాదవ్, డీపీ చారి, ప్రశాంత్, భగవాన్‌దాస్, శ్రీనివాస్, రమణ, రాజేశ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.