హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రానీ పేర్కొన్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతున్నదని.. రాష్ర్టాభివృద్ధికి ఇది శుభ సూచికమని తెలిపారు. టీ హబ్ వినూత్న ప్రయత్నమని కొనియాడారు. ‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అవకాశాలు, సవాళ్లపై శాస్త్రీయ పరామర్శ’ అనే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సిటీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్లో ఆయన ప్రసంగించారు. అనంతరం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో పలు రంగాల్లో జరిగిన అభివృద్ధిని తన మాటల్లో వివరించారు. ఇంత వేగంగా జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పడం.. నగర అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తున్నది.
నేను నిరుడు జూలైలో హైదరాబాద్‌కు వచ్చాను. పదేండ్ల కిందట నేను చూసిన హైదరాబాద్‌కు, ఇప్పటి నగరానికి పోలికే లేదు. గతంలో కంటే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రపంచ నగరాల్లోనే అత్యంత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నది. అంతర్జాతీయ సంస్థలన్నీ నేడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఉద్యోగ కల్పనలో ఐటీ పాత్ర అమోఘం.
ఒక్కటేమిటి అనేక రంగాల్లో అభివృద్ధి వేగంగా జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఐటీ, ఫార్మా రంగాలతోపాటు లాండ్ స్కేప్స్, మౌలిక వసతుల కల్పనలాంటి అభివృద్ధి శరవేగంగా కొనసాగుతున్నది. ప్రపంచస్థాయి నగరాలతో పోల్చదగినదిగా హైదరాబాద్ పేరొందుతుందనడంలో సందేహించాల్సిన అవసరమే లేదు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి అనేక ఉన్నతస్థాయి కంపెనీలు ఇక్కడ నెలకొల్పుతుండటమే అభివృద్ధికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టీహబ్ నూతన స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నది. మౌలిక వసతుల కల్పనలో కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, గుజరాత్ నుంచి అసోం వరకు తెలంగాణ ముందంజలో ఉన్నదనడంలో సందేహమే లేదు.
ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలోనే రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఈ పథకాలతో రైతుల జీవన ప్రమాణస్థాయి మెరుగైందని చెప్పొచ్చు. రైతుబంధుతో రైతుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పంటల ఉత్పత్తి పెరిగింది. వరి, పత్తి సాగు నుంచి రైతులను ఆయిల్‌పాం సాగువైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇది రైతు శ్రేయస్సును కోరిన ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్బీఐకి 1,200 బ్రాంచీలు ఉన్నాయి. నేను అనేక బ్రాంచీలను సందర్శించాను. రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాల్లోని బ్రాంచీలను 100 శాతం డిజిటలైజేషన్ చేసేందుకు కృషిచేస్తాం. స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్న టీహబ్ స్ఫూర్తితో మేము కూడా నగరంలో స్టార్టప్స్ ప్రత్యేక బ్రాంచ్‌ను ప్రారంభిస్తాం.
దేశస్థాయిలో జాతీయ బ్యాంకుల క్రెడిట్ డిపాజిట్ రేషియో 70% మాత్రమే. కానీ, తెలంగాణ క్రెడిట్ డిపాజిట్ రేషియో మాత్రం 100% కంటే ఎక్కువగా ఉన్నది. సేవింగ్స్ విభాగంలోనే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందున్నది. నిరుడు తెలంగాణ జీడీపీ 11% కంటే ఎక్కువగా, దేశ జీడీపీ మాత్రం 9% కంటే తక్కువగా ఉన్నది. 2.8 లక్షలతో తెలంగాణ తలసరి ఆదాయం ఇతర రాష్ర్టాల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నది. వ్యవసాయ రంగంతోపాటు బ్యాంకింగ్ రంగంలోనూ తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించింది.