హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పురాతన పత్రాలు, రికార్డులను భద్రపరిచేందుకు తెలంగాణ స్టేట్ ఆరైవ్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఇరాన్ కల్చరల్ హౌస్, నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్, ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ఆర్కైవ్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ జరీనా, నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మోహదీ ఖాజే పీరి సమక్షంలో బుధవారం టీహబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ సందర్భంగా తెలంగాణ ఆర్కైవ్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు మాట్లాడుతూ.. భారత్‌లోని ప్రముఖ ఆరైవ్లలో ఒకటైన తెలంగాణ స్టేట్ ఆరైవ్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బహమనీ, కుతుబ్ షాహీ, ఆదిల్షాహీ, మొఘల్ రాజవంశాలకు సంబంధించిన 4.3 కోట్లకుపైగా అరుదైన డాక్యుమెంట్లు, చారిత్రక రికార్డులు ఉన్నట్టు తెలిపారు. వీటిలో 80% రికార్డులు హైదరాబాద్ దకన్ ప్రాంతంలోని పూర్వపు రాజవశీయుల అధికారిక భాషలైన క్లాసికల్ పర్షియన్, ఉర్దూలో ఉన్నట్టు వివరించారు. వీటితోపాటు అనేక చారిత్రక కళాఖండాలు, 1956 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన జీవోలు, గెజిట్లు సైతం ఉన్నట్టు చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం వీటిని పదిలపర్చాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకయ్యే ఖర్చును పూర్తిగా ఇరాన్ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.