హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ కార్పొరేషన్: సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌లో పలు మార్పులు చేయాల్సి రావడంతో బియ్యం పంపిణీ కొంత ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. డిసెంబర్ వరకు కేంద్రం ఇచ్చిన ఐదు కిలోలకు అదనంగా రాష్ట్రం సొంత ఖర్చులతో రాష్ట్రంలోని ప్రతి రేషన్‌కార్డుదారునికి పది కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. లబ్ధిదారులెవరూ ఆందోళన చెందొద్దని, యథావిధిగా బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఈ మేరకు మంత్రి బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
గతంలో పీఎంజీకేఏవై కింద కేంద్రం ఆలస్యంగా నిర్ణయం వెలువరించడంతో 2021 మే నుంచి 2022 డిసెంబర్ వరకు 20 నెలలకు గాను ఒకో వ్యక్తికి 200 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 203 కేజీలు ఇచ్చినట్టు తెలిపారు. తద్వారా 2021 మే, 2022 మే, జూన్ నెలల్లో రాష్ట్రం అదనంగా పంపిణీ చేసిన ఒకో కిలోని ఈ జనవరి నుంచి మార్చి వరకు సర్దుబాటు చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2023 మార్చి వరకు ఒకో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున, ఏప్రిల్ నెల నుంచి యథావిధిగా ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇస్తున్నట్టుగానే ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున బియ్యం అందిస్తుందని, ఇందులో ఎలాంటి కోత లేదని స్పష్టంచేశారు. ప్రజలను ఎలాంటి తికమకకు గురి చేయవద్దని సూచించారు.
ధరలు పెంచి.. పేదల గురించి మాటలా?
ఓ వైపు ప్రజలు నిత్యం వాడుకునే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి వాటిపై ధరల్ని పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు ఉచిత బియ్యంతోపాటు రెండు నెలలు రూ.1500 చొప్పున, వలస కార్మికులకు సైతం రూ.500 చొప్పున అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కేవలం 54.48 లక్షల కార్డులకు మాత్రమే 5 కిలోల చొప్పున అందిస్తున్నదని, కానీ, సీఎం కేసీఆర్ అదనంగా వంద కోట్ల భారాన్ని భరిస్తూ మరో 92 లక్షల మందికి 6 కిలోల బియ్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల నడ్డివిరుస్తున్న కేంద్రం పేదలకు బియ్యం పంపిణీపై మొసలి కన్నీరు కారుస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ఇష్టారీతిన విమర్శలు చేస్తే సహించేది లేదని బీజేపీ నేతలను హెచ్చరించారు.