హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు స్టాంప్ పేపర్ల సరఫరాకు కేంద్రం నిరాకరించినట్టు తెలిసింది. పాత బాకీ చెల్లించాలని, ఆ తర్వాతే కొత్త స్టాక్ కోసం ఇండెంట్ పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయే ప్రమాదం నెలకొందని అధికారులు అంటున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నామని చెప్పుకొంటున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాదార్ పాసు పుస్తకాల ప్రింటింగ్ సంస్థకు బిల్లులు చెల్లించలేదు. ఫలితంగా ఆరేడు నెలలుగా ప్రజలు తిప్పలు పడుతున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో స్టాంపు పేపర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బకాయిలు పేరుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాసిక్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ తెలంగాణకు స్టాంపు పేపర్ల సరఫరాను నిలిపివేసింది. నాలుగైదు నెలలుగా రాష్ట్రంలోకి ఒక్క స్టాంపు పేపర్ కూడా రాకపోవడంతో తీవ్ర కొరత నెలకొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలకోసారి నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వివిధ డినామినేషన్లలో స్టాంపు పేపర్లు కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం స్టాంపు పేపర్ల కొరత నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఫ్రాంకింగ్ చేయించుకోవాలనే ఒత్తిళ్లు పైస్థాయినుంచి ప్రజలకు కామన్‌గా మారుతున్నాయి. ఇక ఈ ఫ్రాంకింగ్ మెషిన్లు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో ఆస్తుల క్రయవిక్రయదారులకు అందుబాటులో లేకుండాపోయాయి.
ఉన్నతస్థాయిలోని కొందరు ఇన్చార్జి అధికారుల మాట చెల్లుబాటు కాకపోవడం వల్లనే స్టాంపు పేపర్లకు సంబంధించిన ఇండెంట్ పెట్టడంలో జాప్యం జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల ఒక అధికారి ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఇండెంట్ పెట్టించినట్టు సమాచారం. దాని ఆధారంగా స్టాంపు పేపర్ల కోసం ప్రత్యేక బృందాలను నాసిక్‌కు పంపించగా పాత బకాయిలు చెల్లించాలంటూ ప్రెస్ అధికారులు తిప్పి పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. కాగా ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి పెద్ద స్పందన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని స్టాంపుల కౌంటర్లు పేరుకే తప్ప ఏనాడూ అవి స్టాంపులను విక్రయించిన దాఖలాలు లేవనేది జగమెరిగిన సత్యం. తాజా కొరత నేపథ్యంలో రూ.100కు బదులుగా విధిలేక గత రూ.10, రూ.20 స్టాంపు పేపర్లను ప్రజలు వినియోగించాల్సి వస్తున్నది. దీంతో ఒక్కో డాక్యుమెంట్‌కు దాదాపు ఆరు స్టాంపు పేపర్లు వాడాల్సి వస్తున్నది. రూ. 10, రూ.20 స్టాంపు పేపర్లను హైదరాబాద్‌లోనే ముద్రిస్తుండటంతో అవి సులువుగా లభిస్తున్నాయి.
రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందిస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖలో ఇప్పటికే పలు సమస్యలు నెలకొనగా.. తాజాగా స్టాంపుల కొరత ఏర్పడింది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌తోపాటు పలు సేవలకు విరివిగా వాడే నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు దొరుకక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరేడు నెలల నుంచి రూ.50, రూ.100 విలువైన స్టాంపుల సరఫరాలో తీవ్ర కొరత నెలకొన్నది. ఎక్కడా స్టాంపు పేపర్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్తుల క్రయవిక్రయదారులు బ్లాక్‌లో ఎక్కువ మొత్తాలను వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తున్నది.