హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికా అంతా సిద్ధమైంది. భారీ సభకు ఆ దేశంలోని డాలస్ నగరం ముస్తాబైంది. వైదికైన అక్కడి డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం గులాబీమయమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒకవైపు బీఆర్ఎస్ రజతోత్సవాలు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సంబురంగా జరుపుకోనున్నారు. ఆయా వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రెండు రోజులపాటు లండన్‌లో పర్యటించిన అనంతరం ఆయన శనివారం రాత్రే డాలస్ నగరానికి బయలుదేరారు. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని వివిధ నగరాల నుంచి తెలంగాణవాదులు ఇప్పటికే డాలస్ చేరుకున్నారు. గత 10 రోజులుగా బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ చైర్మన్ మహేశ్ తన్నీరు, ఎన్నారై సెల్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల సహా యూఎస్ఏలోని ఎన్నారై విభాగానికితోడు పార్టీ ముఖ్యనాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాల సందర్భంగా తెలంగాణవాదులు ప్రదర్శించిన ఉత్సాహం, ఆసక్తి డాక్టర్ పెప్పర్ ఎరినా సాక్షిగా తొణకిసలాడుతున్నది.
అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణవాదులు డాలస్ నగరానికి చేరుకుంటున్నారు. న్యూజెర్సీ, డెలావేర్, హోస్టన్, టెక్సాస్, కొలంబస్, ఆస్టిన్, ఫ్లోరిడా, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజెల్స్, అష్బుర్మ్, చికాగో, కెంటకీ తదితర నగరాల నుంచి తెలంగాణవాదులు పెద్ద ఎత్తున డాలస్ చేరుకున్నారు. వీరితోపాటు బ్రిటన్, కెనడా, గల్ఫ్ తదితర దేశాల నుంచీ సైతం బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు తరలిరానున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై విభాగంతోపాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎన్నారైలు, తానా, ఆటా సంస్థల ప్రతినిధులు వేడుకలకు హాజరయ్యేందుకు ఇప్పటికే సంసిద్ధతను ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేని తెలుగువాళ్లు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆహ్వానితులకు, వేడుకల్లో భాగస్వాములకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
యూఎస్ఏలోని వివిధ రాష్ర్టాలు, నగరాల్లో మరోసారి తెలంగాణ ఉద్యమస్ఫూర్తి తొణకిసలాడుతున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌తో మమేకమై ప్రత్యేక రాష్ట్రం కోసం యూఎస్ఏలోని ఆయా ప్రాంతాల్లో పోరాటాల సందర్భంగా నెలకొన్న వాతావరణం పునరావిష్కరణ అవుతున్నది. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ నాయకత్వంలో ఎన్నారైలు తమ స్థాయిల్లో పోరాటంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ జరుగుతున్న పోరాటాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు ఉద్యమించారు. నాడు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై యూఎస్ఏలో బీఆర్ఎస్ ఎన్నారైలు టీడీఎఫ్ ప్రతినిధులతో కలిసి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు అమెరికాలో పర్యటించిన సందర్భంలో తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తంచేశారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాల్గొనేందుకు యూఎస్ వచ్చిన నాటి ప్రధాని మన్మోహన్సింగ్ సహా పలువురిని నిలదీసిన సందర్భాన్ని తెలంగాణ ఎన్నారైలు డాలస్ సభ నేపథ్యంగా గుర్తుచేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోభివృద్ధికి పడిన అడుగులు, పదేండ్లు తెలంగాణ సాధించిన ప్రగతిని ఎన్నారైలు నెమరువేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ పాలనతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అదే స్థాయిలో చర్చించుకోవడం గమనార్హం. తెలంగాణలో దురదృష్టవశాత్తు మళ్లీ ఉమ్మడిపాలన నాటి దుర్భర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయన్న భావన ఎన్నారైల్లో కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన రజోత్సవ సభ స్ఫూర్తితో డాలస్ సభ నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేశ్ తన్నీరు తెలిపారు. శనివారం డాక్టర్ పెప్పర్ ఎరినా వేదిక ఏర్పాట్లను మాజీ మంత్రులు, పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దేవిరెడి సుధీర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల సుమన్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, గువ్వల బాలరాజు, చంటి కాంతికిరణ్, పైలట్ రోహిత్‌రెడ్డి, నోముల భగత్, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదారి బాలమల్లు, నాయకులు జాన్సన్ నాయక్, మూల విజయారెడ్డి, ముఠా జయసింహ, నంద్యాల దయాకర్, రఘువీర్‌సింగ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బృందంతోపాటు అమెరికా కళాకారులతో డాలస్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో కళాప్రదర్శనలు నిర్వహించనున్నారు.