‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వింటారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఒప్పించి ప్రాజెక్టుకు అనుమతులు సాధిస్తాం. డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి కేటాయింపులపై సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తిచేసుకొనేందుకు, సమస్యలను పరిషరించుకొనేందుకు పక రాష్ట్రంతో చర్చలు కొనసాగిస్తాం. సంపూర్ణమైన అనుమతులను సాధిస్తాం’
– ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2025 మార్చి 3న కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాశాం. మొత్తం 811 టీఎంసీల్లో తెలంగాణాకు 61శాతం అంటే 575 టీఎంసీలను కేటాయించాలని కోరాం. 194 టీఎంసీలతోపాటు, పోలవరం డైవర్షన్ ద్వారా 45 టీఎంసీలు కలిపి దాదాపు 775 టీఎంసీలు దక్కుతాయి. ట్రిబ్యునల్ ముందు అందుకు అనుగుణంగా బలమైన వాదనలు వినిపిస్తున్నాం’
– 7 సెప్టెంబర్ 2025లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 16 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘమైన పరీవాహక ప్రాంతం ఉంది.. జలాలను ఎత్తిపోసుకునే ప్రాజెక్టులున్నయి. నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు సిద్ధమైనయి.. వీటన్నింటికీ మించి ఒక రాష్ట్రంగా, రాజ్యాంగబద్ధంగా నీటి కేటాయింపులను పొందే హక్కు ఉంది. గత రెండున్నరేండ్లుగా ఇదే ముఖ్యమంత్రి, ఇదే నీటిపారుదలశాఖ మంత్రి కృష్ణాజలాల్లో 775 టీఎంసీలు సాధించి తీరుతామని చేసిన ప్రకటనలూ మన కండ్ల ముందే ఉన్నయి.
మరి.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముందు ఈ దేబరింపులు ఏమిటి? కృష్ణాజలాల్లో 775 టీఎంసీలు సాధిస్తే అందులో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు 120 టీఎంసీలు కేటాయించుకున్న తర్వాత కేంద్ర అనుమతుల కోసం ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం? ముఖ్యంగా బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా పోయి, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వేయించుకున్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ తుది అంకంలో ఉన్న సమయంలో ఈ రాజీ ఫార్ములాలు ఎందుకు? ఏ రాష్ర్టానికైనా నీటి కేటాయింపులు ట్రిబ్యునళ్ల ద్వారానే జరగాలని, వాటికే చట్టబద్ధత ఉంటుందని మన రాజ్యాంగంలోనే ఉన్న తర్వాత 90 టీఎంసీలకు ఎన్వోసీ ఇచ్చేందుకు చంద్రబాబు ఎవరు? బనకచర్లకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఇందుకు ఒప్పిస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న కేంద్రం ఎవరు? ఇవి కదా పాలకులు వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఇవే కదా.. తెలంగాణ అప్రమత్తతను సూచిస్తూ సాగునీటిరంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల అడుగులు తెలంగాణ జల హక్కులను సాధించాలనే సంకల్పాన్ని వదిలి ఇప్పటికిప్పుడు అనివార్యతలేని అనుమతుల కోసం దేబరించేందుకు వేగంగా కదులుతున్నయి. అటు ఢిల్లీలోని మోదీ ప్రభుత్వం.. ఇటు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పొరుగు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫార్ములాను అమలుచేసేందుకు ఆరాటపడుతున్నాయి. అందుకే పక్కన అమరావతి, ఎగువన కర్ణాటక, ఆపైన హస్తిన.. ఈ మూడు కేంద్రాలుగా తెలంగాణ హక్కులకు గండికొట్టే జల కుట్రలు ఇప్పటికే పురుడుపోసుకున్నాయి.
కేంద్రం ప్రతిపాదనలు, రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ప్రకటనలు, తుంగభద్ర జలాల వినియోగంపై కేంద్ర జల్‌శక్తి హైలెవల్ కమిటీ ఏర్పాటు.. ఇవన్నీ ఆ కుట్రలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. దీనికి కొనసాగింపుగానే తెలంగాణ సమాజాన్ని మభ్య పెట్టి.. దృష్టిని మరల్చేందుకు (అటెన్షన్ డైవర్షన్) సర్కార్ పెద్దలు ఇప్పుడు ప్రాజెక్టుల బాట పట్టారు. శ్రీశైలంలో నీళ్లున్నన్ని రోజులు నీటిని ఎత్తిపోసి ఎక్కడ పోయాలి అంటూ వెటకారపు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మోటర్ల బటన్లు నొక్కుమని ఆదేశాలు ఇస్తున్నారు.
మంత్రులు హెలిక్యాప్టర్లలో చక్కర్లు కొడుతూ కాళేశ్వరం రిపేర్లు చేస్తం, దేవాదుల పూర్తి చేస్తం.. అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నరు. 31 నెలలుగా సాగునీటి ప్రాజెక్టుల్ని పడావుపెట్టి తెలంగాణ రైతుల నెత్తి మీద కరువు వచ్చి కూర్చున్న తర్వాత నీళ్ల మాటలు మాట్లాడుతున్నరంటేనే తెలంగాణ కొంప ముంచేందుకు రంగం సిద్ధమైందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) కేసీఆర్ నేత్వత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీటికి, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రాజెక్టును ప్రారంభించింది మొదలు పొరుగున ఏపీపాటు, స్వరాష్ట్రంలోని ప్రతిపక్షపార్టీ నేతలు సృష్టించని అడ్డంకులు లేవు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్జీటీ మొదలు సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, సదరన్ జోనల్ కౌన్సిల్ వరకు అన్ని వేదికలపైనా కుట్రలకు తెరలేపారు. అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కవోని దీక్షతో వాటన్నింటినీ అధిగమించారు.
మైనర్ ఇరిగేషన్లో తెలంగాణ పూర్తిగా వినియోగించుకోని 45టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను మొత్తంగా 90 టీఎంసీల నికర జలాలను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేటాయించడంతోపాటు, అనుమతుల కోసం డీపీఆర్‌ను 2022లోనే సీడబ్ల్యూసీకి సమర్పించారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) నుంచి అనుమతుల కోసం 34వ ఈఏసీ సమావేశం నుంచే తీవ్ర ప్రయత్నాలు చేశారు. తుదకు 2023లో 49వ ఈఏసీ అంగీకరించింది. ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కాంగ్రెస్ వచ్చిననాటి నుంచి ఇప్పటికీ దానికి అతీగతి లేకుండా పోయింది.
ఇక పీఆర్ఎల్ఐఎస్ డీపీఆర్‌ను సైతం అప్రయిజల్ లిస్ట్ నుంచి సీడబ్ల్యూసీ తొలగించింది. తాము అడిగిన వివరాలను ఇవ్వాలని కోరినా, ఎన్ని లేఖలు రాసినా తెలంగాణ సర్కార్ స్పందించడం లేదని సీడబ్ల్యూసీనే ఆక్షేపించింది. అంతేకాదు గోదావరి నీటిని మళ్లించడం ద్వారా 45 టీఎంసీల అంశం కూడా ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నదని, వాటిపై స్పష్టతనివ్వాలని, ఈ నేపథ్యంలో డీపీఆర్‌ను పరిశీలన జాబితా నుంచి తొలగిస్తున్నట్టు సీడబ్ల్యూసీ మరీమరీ నొక్కిచెప్పింది. మరోవైపు కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్‌లో విచారణ అంశంగా ఉందని, తుది అవార్డు వచ్చేంతవరకూ ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని కేంద్ర జల్‌శక్తిశాఖ సైతం గతంలోనే తేల్చిచెప్పింది. పరిస్థితి ఇలా ఉంటే అందుకు భిన్నంగా ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అనుమతులను సాధిస్తామంటూ పదేపదే నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీ కుట్రలను, అందుకు అడుగడగునా మద్దతునిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన, ధీటుగా బదులివ్వాల్సిన రేవంత్‌రెడ్డి సర్కార్ అందుకు భిన్నంగా దాసోహమనడమే ఇప్పుడు తెలంగాణ నీటిరంగనిపుణుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరించిన చందంగా వ్యవహరిస్తున్న ఏపీతో చర్చలకు ఉరకలేస్తూ తెలంగాణకు శాశ్వత మరణశాసనం రాస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
చట్టబద్ధమైన ట్రిబ్యునల్ వాదనలకు భిన్నంగా ప్రత్యేకంగా పొరుగు రాష్ర్టాలతో ఒప్పందాలకు మొగ్గుచూపుతూ తెలంగాణ హక్కులను తాకట్టుపెడుతున్నారని నీటిరంగనిపుణులు నిప్పు లు చెరుగుతున్నారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ అనుమతుల కోసం కర్ణాటక ప్రాజెక్టులకు అనుమతులిచ్చారు. పాలమూరు అనుమతుల కోసమంటూ పోలవరం, బనకచర్లకు అనుమతులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఎగువ నుంచి దిగువకు జలాలే రానప్పుడు, పొరుగు రాష్ర్టాలు చెరబడితే అనుమతులు వచ్చినా ఆ ప్రాజెక్టుల మనుగడ ఎలా? అన్న సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అంతేకాదు ట్రిబ్యునల్ తీర్పులకు, నీటి కేటాయింపులకే చట్టబద్ధమైన రక్షణ ఉండటంతోపాటు, వాటిపై న్యాయపోరాటానికి అవకాశముంటుంది. ఒకసారి ఒప్పందాలు చేసుకున్న తరువాత న్యాయస్థానాలూ ఏమీ చేయబోవని వివరిస్తున్నారు. ఇటీవల ఏపీ చేపట్టిన పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టుపై చర్చల కోసం కేంద్రంతో కలిసి నిపుణుల కమిటీ ఏర్పాటునకు తెలంగాణ అంగీకరించింది. ఆ తరువాత ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కానీ చర్చల కోసం కమిటీ వేసుకున్నాక ఎందుకు వచ్చారని? అత్యున్నత ధర్మాసనం నిలదీయడమేకాగా, పిటిషన్‌ను డిస్మిస్‌ను చేసింది. రేపు ఇష్టారీతిన ఒప్పందాలు చేసుకుంటే ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని, హక్కులకు పూర్తిగా తూట్లు పడతాయని తెలంగాణవాదులు ఉదహరిస్తున్నారు. రేవంత్ సర్కార్ ఏపీకి, కేంద్రానికి దాసోహం అంటూ జలహక్కుల్లో తెలంగాణకు మరోసారి మరణశాసనం రాస్తున్నదని నిప్పులు చెరుగుతున్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మరోరకంగానూ పక్కదోవ పట్టిస్తున్నది. పునర్విభజన చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టును చేపట్టినా పొరుగున ఏపీ రాష్ట్రం సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని నమ్మబలుకుతున్నది. అందులో భాగంగా చర్చలు కొనసాగిస్తూ, ప్రాజెక్టులకు ఏపీ సమ్మతి తీసుకొస్తామంటూ పదేపదే వల్లెవేస్తున్నది. అదే నిజమైతే ఏపీ ప్రభుత్వం సైతం కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే తెలంగాణ సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది.
మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు తెలంగాణ నుంచి ఏపీ సమ్మతి తీసుకున్నదా? హంద్రీనీవా, గాలేరునగరి, శ్రీశైలం రైట్బ్రాంచ్ కెనాల్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ విస్తరణ పనులను ఎవరి అనుమతితో చేపడుతున్నది? పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) అనుమతుల కంటే రెట్టింపు సామర్థ్యంతో చేపడుతున్నది. పోలవరం డ్యామ్ డెడ్‌స్టోరేజీ నుంచి జలాలను ఎత్తిపోసుకునేందుకు కొత్తగా పోలవరం లిఫ్ట్ స్కీమ్‌ను చేపట్టింది.
పురోషత్తమపట్నం, చాగల్నాడు తదితర అనేక లిఫ్ట్‌లను ఏ అనుమతులు తీసుకొని చేపట్టింది? కనీసం ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌ను కూడా తెలంగాణకు ఇవ్వడం లేదు. కేఆర్ఎంబీని ఆదేశించినా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి పూర్తిగా కృష్ణా బేసిన్లో నిర్మితమైన తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ సమ్మతి ఎందుకు అవసరం. అదీగాక రేవంత్‌రెడ్డి సర్కార్ చెబుతున్నట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొత్తదేమీ కాదు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసింది. డిండిది సైతం అదే తీరు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టులన్నింటికీ ఉమ్మడి ఏపీలోనే అనుమతులు మంజూరైనయి. మరి కొత్తగా ఏపీ సమ్మతి ఎందుకనేది అంతుచిక్కని విషయం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టింది. డీపీఆర్ వెనక్కి వచ్చినా రెండున్నరేండ్లుగా కిక్కురుమనకుండా ఉండిపోయింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 18 ప్యాకేజీలుగా చేపట్టారు. ఇప్పటికే నీటిని తరలించే ప్రధాన కాలువ తవ్వకం, నిల్వ చేసుకొనేందుకు కావాల్సిన ప్రధాన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది. నీటిని ఎత్తిపోసేందుకు బాహుబలి పంపులు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలనే కాంగ్రెస్ ప్రభుత్వం వెట్ రన్ నిర్వహించింది.
మరోవైపు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు తుదిదశకు చేరుకున్నాయి. అతిత్వరలోనే నీటివాటాలకు సంబంధించి అవార్డు వచ్చే అవకాశముంది. కృష్ణాజలాల్లో 775 టీఎంసీల వాటా కోసం తెలంగాణ వాదనలు వినిపించింది. అందులో ప్రస్తుతమున్న 299 టీఎంసీలకు అదనంగా మరో 300 టీఎంసీలైనా దక్కుతాయని అధికారులు ఘంటాపథంగా చెప్తున్నారు. అప్పుడు పాలమూరుకు 90 టీఎంసీలు, డిండి 30 టీఎంసీలే కాదు నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర కృష్ణాబేసిన్‌లోని వరద ఆధారిత ప్రాజెక్టులన్నింటికీ నికర జలాలు కేటాయించుకోవచ్చు. స్వతహాగానే అనుమతులు సాధించవచ్చు. కానీ రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం ఇప్పటికే నిర్మాణం పూర్తయి, వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుకు కొత్తగా మళ్లీ అనుమతులు సాధిస్తామంటూ హడావుడి చేయడం గమనార్హం. అంతేకాదు పొరుగురాష్ర్టాలతో చర్చల పేరిట ఒప్పందాలకు సిద్ధమవుతున్నారు. తద్వారా ట్రిబ్యునల్ వాదనలన్నీ వీగిపోయి, తెలంగాణ జలహక్కులకు తీరని విఘాతం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది.
రాష్ర్టాలు చేసుకొనే ఒప్పందాలకు చట్టబద్ధమైన విలువ ఉండబోదని నీటిరంగనిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు ప్రస్తుత ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)నే ప్రధానంగా ఉదహరిస్తున్నారు. వాస్తవంగా 1944లో అప్పటి మద్రాస్ ప్రభుత్వం (ఆంధ్ర అందులో భాగం), హైదరాబాద్ రాష్ట్రం చేసుకున్న ఒప్పందాల ఫలితంగా సుంకేశులకు ఎగువన ఆర్డీఎస్ పురుడుపోసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం కేసీ కెనాల్, ఆర్డీఎస్ కాలువ సరిసమానంగా తుంగభద్ర జలాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
మద్రాస్ నుంచి 1953లో వేరుపడి ‘ఆంధ్ర’ రాష్ట్రం, ఆ తరువాత 1956లో తెలంగాణను కలుపుకొని ‘ఆంధ్రప్రదేశ్’ గా అవతరించింది. 1944 ఒప్పందం ప్రకారం ఆర్డీఎస్ కెనాల్, కేసీ కెనాల్‌కు సమానంగా నీటిని కేటాయించాల్సిన ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే ఆ ఒప్పందాన్ని పట్టించుకోవాల్సిన అవసరంలేదని బచావత్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. కేసీ కెనాల్‌కు 69.4 టీఎంసీలు కావాలని, ఆర్డీఎస్కు కేవలం 15.9 టీఎంసీలు మాత్రమే కావాలని డిమాండ్ చేసింది. వాదనలు విన్న ట్రిబ్యునల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలు, ఆర్డీఎస్కు 15.9 టీఎంసీలు కేటాయించింది.
వెరసి 1944 ఒప్పందమనేది లేకుండా పోయిం ది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం, ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించే అవకాశం దక్కడంతో నాటి ఒప్పందం ప్రకారం జలాలను కేటాaయించాలన్న డిమాండ్‌ను మరోసారి ముందుపెట్టింది. అంతేకాదు 1974 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించినట్లయితే, నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం నీటిని బేసిన్‌లోని రాష్ర్టాలైన కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14, ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల చొప్పున పంచింది. అందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సైతం అంగీకారం తెలిపింది.
డైవర్షన్‌లో భాగంగా వచ్చే 45 టీఎంసీలను ఉమ్మడి ఏపీ కేవలం సాగర్ ఎగువన కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకే వినియోగించుకోవాలనే షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే ఆ నికర జలాలను ఎస్ఎల్బీసీకి కేటాయిస్తూ డీపీఆర్‌ను సైతం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి 1985లోనే పంపగా, అప్పటికీ పోలవరం ప్రారంభం కాని నేపథ్యంలో తిరస్కరించింది. ప్రస్తుతం సాగర్ ఎగువన బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ తెలంగాణవే. ఆ 45 టీఎంసీలు వాస్తవంగా తెలంగాణకే దక్కుతాయి. కానీ ఆనాడు అంగీకరించిన ఏపీనే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నది.
తనకే ఆ జలా లు చెందుతాయని వాదనలు వినిపించడంతో తుదకు ట్రిబ్యునల్‌కు రెఫర్ చేశారు. ఇవేకాదు ఇలా చెప్పుకుంటూపోతే నదీజలాలపై రాష్ర్టాలు చేసుకున్న అనేక ఒప్పందాలు ఆచరణలో నీరుగారిపోయాయి. నాడు హైదరాబాద్ స్టేట్, మద్రాసు, మైసూరు రాష్ర్టాలు చేసుకున్న ఒప్పందాలన్నింటినీ ఉమ్మడి ఏపీ పాలకులే అటకెక్కించి తెలంగాణకు అన్యాయం చేశారు. నేడు మరోసారి ఒప్పందాల పేరిట బురిడీ కొట్టించేందుకు ముందుకు వస్తుండగా, బాబు చేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వత్తాసు పలుకుతున్నారు.