Staff Nurse Transfers | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): నర్సింగ్ అధికారుల బదిలీలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చిన అధికారులు గురువారం రాత్రి మాడిఫై పేరిట మళ్లీ ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని గ్రేడ్-2 నర్సులు పేర్కొన్నారు. తొలుత ఫోకల్ టు ఫోకల్ కింద కౌన్సెలింగ్ నిర్వహించి హైదరాబాద్‌లోని ఆయా దవాఖానల్లో వీరికి పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో వారంతా వారం రోజుల క్రితమే కొత్తగా కేటాయించిన పోస్టింగ్‌లలో చేరిపోయారు.
కానీ వారిని గురువారం రాత్రి దూరప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు బదిలీ చేశారు. ఇలా కొంతమందిని మాత్రమే మాడిఫై కింద బదిలీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం గడవక ముందే ఏ నిబంధనల ప్రకారం రెండోసారి తమను బదిలీ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉంటే అందరికీ సమానంగా ఉంటాయని, ఈ బదిలీల్లో డబ్బులు ఇచ్చినవారికి కోరుకున్న చోట పోస్టింగ్‌లు కల్పించడం, ఇవ్వని వారికి ఇచ్చిన పోస్టింగ్‌లు క్యాన్సల్ చేసి, దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నర్సింగ్ సిబ్బంది బదిలీల్లో లక్షల రూపాయలు చేతులు మారాయని, అందువల్లనే దగ్గర ఇచ్చిన పోస్టింగ్‌లు దూరమయ్యాయని, దూరమిచ్చిన పోస్టింగ్‌లు దగ్గరయ్యాయని పలువురు నర్సింగ్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఉస్మానియా దవాఖానలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుజాత రాథోడ్‌కు కౌన్సెలింగ్ ద్వారా సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో పోస్టింగ్ కల్పించిన అధికారులు వారం తిరగకుండానే ఆమెకు నగరంలోని పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో పోస్టింగ్ ఎలా కల్పించారని ప్రశ్నించారు.
గాంధీ లో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధు లు నిర్వర్తిస్తున్న మంగమ్మను మహబూబ్‌నగర్‌కు బదిలీ చేసిన అధికారులు వారంలోపే ఆమెకు తిరిగి ఉస్మానియా దవాఖానలో పోస్టింగ్ కల్పించడం, ఉస్మానియాలో హెడ్ నర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న శిరీషకు గాంధీ దవాఖానలో పోస్టింగ్ కల్పించడంలో ఏ నిబంధనలు పాటించారని వారు ప్రశ్నిస్తున్నారు.