సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 7 : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో మరో వివాదం చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన నమిలికొండ దేవరాజు కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఐదు వారాలుగా సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానలోని డయాలసిస్ సెంటర్లో దేవరాజుకు చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి దేవరాజు అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు దవాఖానకు తీసుకువచ్చారు. డయాలసిస్ సెంటర్లో పేరు నమోదు చేసుకునే క్రమంలో సిబ్బంది, కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. దేవరాజు కొడుకు శివకుమార్, భార్య రాజేశ్వరి దేవరాజుకు చికిత్స అందించాలని ప్రాధేయపడినప్పటికీ పట్టించుకోకుండా సిబ్బంది వాగ్వాదానికి దిగారు. శివకుమార్‌తో పాటు రాజేశ్వరిపై ఇష్టానుసారంగా బూతులు తిడుతూ దాడికి దిగారు. దీంతో వారు మంగళవారం ఉదయం దవాఖాన ఆర్‌ఎంవోతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఆర్‌ఎంవోను వివరణ కోరగా డయాలసిస్ సెంటర్ ప్రైవేట్ సంస్థ నిర్వహణలో ఉన్నదని తెలిపారు.