హైదరాబాద్, అక్టోబర్24 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన తర్వాత ఎస్సారెస్పీ స్టేజీ 2కు చరిత్రలోనే తొలిసారి నీళ్లు అందించగలిగామని రామగుండం విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈమేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ ఎదుట నివేదించారు. మేడగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ చేపట్టిన విచారణకు గురువారం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అంబేద్కర్ ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు మధ్య వ్యత్యాసాలు, డీపీఆర్ తయారీ, ప్రాజెక్టుల ప్రయోజనాలు, నిధుల ఖర్చు, డిజైన్లు తదితర అంశాలపై 130కిపైగా ప్రశ్నలు సంధించారు. పీసీసీ ప్రాజెక్టుతో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా 2 లక్షల ఎకరాలే కొత్తగా పెరిగిందని, ఆ మాత్రానికి వేల కోట్లు ఖర్చు చేయడం సమంజసమేనా? అని కమిషన్ ప్రశ్నించింది. దీనికి వెంకటేశ్వర్లు బదులిస్తూ ప్రాణహిత-చేవేళ్లలో కొత్త ఆయకట్టు 16 లక్షల ఎకరాలు ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టులో 18.25లక్షల ఎకరాలని, అలాగే ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్, వరదకాలువ తదితర ప్రాజెక్టుల కింద అప్పటికే ఉన్న 18.83 లక్షల ఎకరాల స్థిరీకరణ కూడా ఉందని తెలిపారు. సాంకేతిక అం శాలపై కమిషన్ అడిగిన ప్రశ్నలకు వెంకటేశ్వ ర్లు బదులిచ్చారు.