గూడూరు, డిసెంబర్ 7 : ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గూడూరు బాలుర ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఈసం రుత్విక్ ఆరో తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో ఉంటున్న సీనియర్లు తనను తరచుగా వేధించడంతో మనస్తాపం చెంది శనివారం అలర్జీకి రాసుకునే లిక్విడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గ్రహించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు, వార్డెన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. ఎస్సై గిరిధర్‌రెడ్డి దవాఖానకు చేరుకుని విచారించగా సీనియర్లు వేధిస్తున్నారని బాధిత విద్యార్థి తెలిపాడు. వసతి గృహానికి వెళ్లి విద్యార్థులను విచారించారు. హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, వసతులు సరిగాలేవని, నిద్రిస్తున్న సమయంలో సీనియర్ విద్యార్థులు తమ దుప్పట్లను తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
సమస్యల వలయంలో సంక్షేమ గృహాలు : ఎన్టీవీఎస్
రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని నవ తెలంగాణ విద్యార్థి సంఘం (ఎన్టీవీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు బానోత్ రామన్ననాయక్ ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లలో ప్రతిరోజూ ఏదో ఒక ఘటన జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
టీచర్ తిట్టాడని.. ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థి.. పరిస్థితి విషమం
గోడ కుర్చీ వేయించటంతోపాటు అందరి ముందే టీచర్ తిట్టాడనే మనస్తాపంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. రాయదుర్గం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ కథనం ప్రకారం స్థానిక నాగార్జున హైస్కూల్లో ఈ నెల 4న మ్యాథ్స్ టీచర్ అబ్దుల్ నహీం విద్యార్థి బాలును లెక్కలు సరిగా చేయటం లేదని గోడ కుర్చీ వేయించాడు. తోటి విద్యార్థుల ముందే తిట్టాడు. మనస్థాపానికి గురైన బాలు.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. బాలు తల్లి శోభ గుర్తించి, పక్కింటి వారి సాయంతో బాలును దవాఖానకు తరలించారు. బాలు పరిస్థితి విషమంగా ఉన్నదని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.