హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): శ్రీరామ్‌సాగర్ సాగునీటి ప్రాజెక్టు రెండో దశకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఏఐకేఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. భీమిరెడ్డి పేరును కాదని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టాలని సీఎం సూచించడం తగదని పేర్కొన్నారు. సోమవారం అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఓంకార్ భవన్లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి సర్కారు చరిత్రను కాలరాసే ఉద్దేశంతోనే బీఎన్ పేరును శ్రీరామ్‌సాగర్ రెండోదశకు పెట్టకుండా.. దామోదర్ రెడ్డి పేరును సూచించిందని విమర్శించారు. తక్షణమే ఎస్సారెస్పీ రెండో దశకు బీఎన్‌రెడ్డి పేరును ప్రకటించి, ట్యాంకుబండ్‌పై కాంస్య విగ్రహాన్ని, విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో బీఎన్‌రెడ్డి కుమారుడు భీమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అల్లుడు మల్లు కపోతంరెడ్డి, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు గోనే కుమారస్వామి, ఎన్ రెడ్డి హంసారెడ్డి, కుంభం సుకన్య, వంగాల రాగసుధ, అంగడి పుష్ప, తాండ్ర కళావతి, వనం సుధాకర్, మంద రవి, గడ్డం నాగార్జున, పల్లె మురళి తదితరులు పాల్గొన్నారు.