మహదేవపూర్ (కాళేశ్వరం), మే 26: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15న ప్రారంభమైన సరస్వతీ పుషరాలు సోమవారం ముగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు లక్షలాదిగా కాళేశ్వరం క్షేత్రానికి తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి గంటల సమయం పట్టగా, పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోగా రెస్క్యూ టీం దవాఖానకు తరలించింది. ఆలయ పరిసరాలు, త్రివేణి సంగమం జనసందోహంగా మారింది. ప్రధాన రహదారులు భక్తులతో కికిరిసిపోగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు దంపతులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీ మాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ముక్తీశ్వరస్వామి ఆలయంలో 12 రోజులపాటు వైభవంగా నిర్వహించిన హోమాలు పూర్ణాహుతితో ముగిశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈవో మహేశ్ పాల్గొన్నారు. పుషరాలకు వచ్చిన భక్తులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు లేక అవస్థలు పడ్డారు. సిరిసిల్ల నుంచి వచ్చిన భక్తులు పుషరస్నానం ఆచరించి తిరిగి వెళ్తున్న క్రమంలో మహదేవపూర్ మండలం బలిజపూర్ ప్రాంతంలో బస్సులో విద్యుత్ షార్ట్ సర్క్యూటై దగ్ధమైంది. రెండు అగ్నిమాపక యంత్రాలు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.