వనపర్తి, జనవరి 7(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతున్నా, ఎవరూ అడ్డుపడటం లేదంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. జలచౌర్యంపై తన లాంటి చిన్నవాళ్లు గొంతెత్తినా ప్రయోజనం ఉండడం లేదని, ఇతర ముఖ్యులెవరూ మాట్లాడటం లేదని వాపోయారు. బుధవారం వనపర్తిలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పోతిరెడ్డిపాడు జలచౌర్యం ఆపకుం టే.. ఎస్‌ఎల్‌బీసీతోపాటు ఎంజీకేఎల్ఐ వంటి పథకాలకు సాగునీరు కష్టమవుతుందని చెప్పారు. నాడు 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు ద్వారా నేడు 99వేల క్యూసెక్కుల సామర్థ్యం పెంచి నీటిని తరలిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే రాయలసీమ జలదోపిడీకి బ్రేక్ వేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి చేపడుతున్న ఎత్తిపోతల పథకం వద్దని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.
15 టీఎంసీలకుపైగా ఉన్న వట్టెం రిజర్వాయర్ లేదా కరివెన రిజర్వాయర్ నుంచి ఈ ఎత్తిపోతలు చేపడితే కేవలం రూ.300 కోట్లతోనే డిండికి నీరు చేరుతుందని అభిప్రాయపడ్డారు. అలాంటిది చిన్నగా ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి రూ.1800 కోట్ల ప్రతిపాదనతో డిండి ఎత్తిపోతలకు అప్రూవల్ ఇచ్చారని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో 6 స్పిల్‌వే గేట్లు తెలంగాణకు కేటాయించాల్సి ఉన్నా.. ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నదని వాటి మెయింటెనెన్స్ నాగర్‌కర్నూల్ జిల్లా ఇరిగేషన్ సీఈ పరిధిలోకి రావాలని, లేనిపక్షంలో సాగునీటి కష్టాలు తప్పవని చిన్నారెడ్డి హెచ్చరించారు. కేసీ కెనాల్‌ను నాటి సీఎం విజయభాస్కర్‌రెడ్డి పక్షపాతంతో నిర్మించి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని గుర్తుచేశారు. సాగునీటి రంగంపై ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ జరిగేందుకు ప్రయత్నం జరుగుతున్నదని, ప్రతి చిన్న విషయాన్నీ కేంద్ర జలమంత్రికి, అపెక్స్ కౌన్సిల్‌కు, బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదులు చేస్తూ అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. కొడంగల్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు జూరాల ద్వారానే వరద జలాలతో సాగునీరందించేలా ప్రత్యేక ఎత్తిపోతలను చేపట్టాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి కేటాయింపులు అవసరమని చెప్పారు.
మళ్లీ సీఎం అవకాశం రాదు
ఉమ్మడి పాలమూరుకు చెందిన వారికి మళ్లీ జన్మలో సీఎం పదవి అవకాశం రాదని చిన్నారెడ్డి జోస్యం చెప్పారు. లక్ష కోట్లతో జిల్లాను అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, వనపర్తి కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదే అన్నట్టు చిన్నారెడ్డి ఓ వైపు.. ఇద్దరు ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించడం చర్చకు దారితీసింది.