మహబూబ్నగర్ : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాలకొండ వద్ద స్పోర్ట్స్ బైక్, కారు ఢీ కొన్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు.
కాగా, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ సమీపంలో స్పోర్ట్స్ బైక్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు, కారులోని ముగ్గురు దుర్మరణం చెందారు. ఓ కుటుంబం వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో మృతిచెందిన వారిని గౌసియా (30), అమీర్ (18 నెలలు), ఉజెఫా(8) గా గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.