హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని డాలస్‌లో జూన్ 1న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందుకు గత 10 రోజులుగా జరుగుతున్న సన్నాహక సమావేశాలే స్పష్టం చేస్తున్నాయి. సభకు వచ్చేందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 70% మంది యువత ఉన్నదని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం డాలస్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో ఆయా విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ అరినాలో జూన్ 1న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవాలను అమెరికా అబ్బురపడే రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేశ్ తన్నీరు సహా యూఎస్ఏలో ఉండే తెలంగాణీయులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేస్తున్నారు.
అందులో భాగంగా బీఆర్ఎస్ ఎన్నారై విభాగంతోపాటు, పార్టీ కీలక నేతలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు. డాలస్ రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యేందుకు లండన్ పర్యటన ముగించుకొని శుక్రవారమే అమెరికాకు పయనమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, తాతా మధు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిశోర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, చంటి క్రాంతికిరణ్, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు ఇప్పటికే అమెరికాకు చేరుకొని సన్నాహక సమావేశాల్లో తలమునకలయ్యారు.
తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ చేతిలో ఉంటేనే సురక్షితంగా ఉంటుందని, ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. అమెరికాలోని డాలస్‌లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ విప్లవాత్మకంగా పురోగమించిందని చెప్పారు. రాష్ట్రంలోని పేదలు, రైతుల కష్టసుఖాలు తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆరేనని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో వెనక్కి వెళ్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణను చూసి దేశం అనుసరించే పరిస్థితిని కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. కేసీఆర్ దూరదృష్టితోనే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు మారుమోగిందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సారథి మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేశ్ తన్నీరు సమావేశాన్ని సమన్వయం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు, ఎన్నారై విభాగం నాయకులు జాన్సన్ నాయక్, ముఠా జయసింహ, పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, ఆశిష్ యాదవ్, అభిలాశ్ రంగినేని పాల్గొన్నారు. ఉదయ్ యాదవ్, సామ్ పుసపల్లి, శశి దోంతినేని, అనిల్ పెండ్యాలతోపాటు వివిధ విద్యాలయాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.